16 నుంచి ఏపీ ‘అసెంబ్లీ’

7 Jun, 2020 03:43 IST|Sakshi

ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ ప్రసంగం

ఆ తర్వాత బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం

18న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన

పలు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీ ప్రారంభం కానున్నాయి. మార్చిలో ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టినందున ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను  ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 11న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, 16 నాటి సమావేశంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. 

► గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమై.. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? తదితర అంశాలను ఖరారు చేయనుంది.
► ఈ నెల 19న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు శాసనసభ్యులు అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ తేదీ కలిసొచ్చేలా 16 నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
► 18న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 
► సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 
► ఈ నెల 11న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా ఏపీ పర్యావరణ పరిరక్షణ బిల్లును సిద్ధం చేయాలని రెండ్రోజుల కిందటే సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 
► కరోనా నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలను సాధ్యమైనన్ని తక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు