అమరవీరులకు శాసనసభ సంతాపం

18 Jun, 2020 03:21 IST|Sakshi
శాసనసభలో అమరవీరులకు సంతాపం తెలుపుతున్న సీఎం వైఎస్‌ జగన్, సభ్యులు

కల్నల్‌ సంతోష్‌ త్యాగం మరువలేనిది: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: గాల్వన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవానులకు రాష్ట్ర శాసనసభ సంతాపం ప్రకటించింది. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమర వీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు విధి నిర్వహణ చేస్తూ.. గాల్వన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని.. వారికి రాష్ట్ర ప్రజల తరఫున శాసనసభ ఘన నివాళులర్పిస్తోందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. వీర మరణం పొందిన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. అనంతరం రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అలాగే శాసనమండలిలో కూడా బీజేపీ సభ్యుడు మాధవ్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మూడు నిమిషాలు మౌనం పాటించి అమర వీరులకు నివాళులర్పించారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. వీర మరణం పొందిన భారత సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు