ఆ నిధులనేం చేస్తారు?

23 Dec, 2013 01:26 IST|Sakshi

విభజన బిల్లులో కేవలం 41 సంస్థల నిధుల వివరాలే
ఏజీ నివేదిక మేరకు పబ్లిక్ ఖాతాల్లో రూ. 25 వేల కోట్లు
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లులోని 7వ షెడ్యూల్‌లో 41 సంస్థలకు సంబంధించిన నిధుల గురించి మాత్రమే కేంద్రం పేర్కొంది. ఈ సంస్థల నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 52వ సెక్షన్‌లో పేర్కొన్నారు. అయితే, 2012-13 ఆర్థిక సంవత్సరం  అకౌంటెంట్ జనరల్(ఏజీ) ఆడిట్ నివేదిక ప్రకారం ప్రభుత్వానికి చెందిన వివిధ పబ్లిక్ ఖాతాల్లో రూ. 25 వేల కోట్ల నిధులున్నాయి. ఆ నిధుల్లో.. ఆ 41 సంస్థలకు చెందినవే కాకుండా ఇంకా ఇతర సంస్థలకు చెందిన నిధులు ఉన్నట్లు తేలింది. దాంతో 7వ షెడ్యూల్‌లో పేర్కొనని సంస్థల నిధులను ఏం చేస్తారు? వాటిని 2 రాష్ట్రాలకు పంపిణీ చేస్తారా, లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల నిధులు మాత్రమే అయితే అవి చాలా తక్కువ మొత్తమే ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోని పబ్లిక్ ఖాతా పుస్తకంలో చాలా రకాల సంస్థల నిధుల వివరాలు ఉన్నాయి.
 
 విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నిధులు, వివిధ కేంద్ర, రాష్ట్ర చట్టాల కింద డిపాజిట్ చేసిన నిధులు, భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డిపాజిట్ నిధులు, సినిమా, ఆర్కియాలజీ, మ్యూజియం డిపాజిట్, సహకార ట్రిబ్యునల్, లేబర్ కోర్టులు, మాచ్‌ఖండ్, తుంగభద్ర, ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల అభివృద్ధి నిధి, టీటీడీ, ఉద్యోగశ్రీ, ప్రాంతీయ వర్క్‌షాపులు, మెకానిక్, కంటోన్మెంట్, గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ, అటవీ అభివృద్ధి, పౌర సరఫరాల సంస్థ, రాష్ట్ర చేనేతకారుల సహకార సంఘం, నిజాం వైద్య విజ్ఞాన సంస్థ సహా అనేక సంస్థలకు చెందిన డిపాజిట్లు, నిధులు.. వీటి వివరాలేవీ బిల్లులోని 7వ షెడ్యూల్‌లో లేవు. ఈ నేపథ్యంలో అన్ని సంస్థల ఫండ్స్, డిపాజిట్లను గుర్తించి వాటిని కూడా 7వ షెడ్యూల్‌లోకి తీసుకురావాల్సి ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అలా చేస్తేనే రూ. 25 వేల కోట్లకు పైగా నిధులను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి వీలవుతుందని చెబుతున్నాయి. చాలా సంస్థలకు చెందిన ఖాతాల్లో ఫండ్ కిందో, డిపాజిట్ రూపంలోనో చాలా సంవత్సరాల నుంచి నిధులు కొనసాగుతున్నాయని, వాటిని వ్యయం చేయడం లేదని, ఇప్పుడు అలాంటి సంస్థల నిధులను లెక్కతీసి ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు