ఉద్యోగాలు హుష్!

6 Oct, 2013 00:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంతో ఇక రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాఫ్ పడింది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు, ప్రభుత్వంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న దాదాపు 20 లక్షల మంది మంది నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు పోసి పరీక్షలకు సిద్ధమైనా ఫలితం లేకుండాపోవడంతో ఉసూరుమంటున్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణలు పొందుతున్న నిరుద్యోగులు చేసేదేమీ లేక ఇంటిదారి పట్టారు.

 

గడిచిన నాలుగు నెలల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 63,518 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీ కూడా నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయలా? వద్దా? అని ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ లేఖ రాసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ముఖ్యమంత్రే కాదు.. ఉన్నతాధికారులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్రం విడిపోనున్న నేపథ్యంలో ఇంత భారీ సంఖ్యలో పోస్టులను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం సరికాదని, విభజన తర్వాతే ఆయా రాష్ట్రాల్లో నియామకాలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
 
 ఖాళీల భర్తీకి అనుమతిచ్చినా..
 
 రాష్ట్రంలో 63,518 ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రస్థాయి, మల్టీ జోన్, జోనల్ పోస్టుల భర్తీకి అవకాశమే లేకపోగా.. ఆందోళనలు, ఉద్యోగుల సమ్మెతో జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు జారీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ 28న వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల్లో కలిపి 63,621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ సమావేశంలో తేల్చారు. వాటిల్లో ఆర్థికశాఖ ఇప్పటి వరకు 63,518 పోస్టుల భర్తీకి దశల వారీగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3న 33,738 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ప్రధానంగా ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు (గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4, లెక్చరర్ తదితర అన్ని కేటగిరీలు), పోలీసు శాఖలో 11,623 కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు, డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 10,865 పోస్టులను భర్తీ చేసుకోవచ్చని అందులో పేర్కొంది.
 
 ఇక జూలై 2న 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి, ఏపీపీఎస్సీ ద్వారా మరో 1,127 పోస్టుల భర్తీకి, డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 2,443 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందే 2,677 గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. తాజాగా సెప్టెంబరు 30న కూడా మరో 3,025 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత మూడు రోజులకే తెలంగాణ నోట్‌కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలుపడం.. సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటడంతో నోటిఫికేషన్ల జారీపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినప్పుడే నోటిఫికేషన్లు జారీ చేయాలా? వద్దా? అని ఏపీపీఎస్సీ కోరినా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇకపై నోటిఫికేషన్ల జారీకి ఓకే చెప్పే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఏపీపీఎస్సీ మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే సిద్ధంగా ఉండేందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన అన్ని పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే నోటిఫికేషన్లను జారీ చేస్తామని కమిషన్ వర్గాలు వెల్లడించాయి.


 కొత్త పనులకు బ్రేక్..


 తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొత్త పనులకు బ్రేక్ పడింది. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు మాత్రం నిధులు విడుదల చేస్తారని, బడ్జెట్‌లో నిధులున్నప్పటికీ ఏ ప్రాంతానికి కూడా కొత్తగా పనులను మంజూరు చేయరని అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థికపరమైన అంశాలతో కూడిన ఎలాంటి పనులను కొత్తగా చేపట్టరని అధికారులు తెలిపారు. కొత్త పనులకు ప్రభుత్వం శంకుస్థాపనలు కూడా చేయబోదని పేర్కొన్నారు. కొత్తగా విద్యాలయాలు, ఆసుపత్రులు, సాగునీటి ప్రాజెక్టులు, మంచినీటి ప్రాజెక్టులు, రహదారులు, భవనాల నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయరని అధికార వర్గాలు వివరించాయి. శుక్రవారం చిత్తూరు మంచినీటి పథకానికి రూ.4,300 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా ఈ మంచినీటి పథకానికి శంకుస్థాపన చేయాలని అనుకున్నప్పటికీ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు