రాజ్యాంగానికి విరుద్ధంగా పూర్తిస్థాయి బడ్జెట్!

5 Feb, 2019 09:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల వేళ సంప్రదాయబద్ధంగా ఓటాన్‌ అకౌంట్‌ (మధ్యంతర) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాల్సిన ప్రభుత్వం.. రాజ్యాంగానికి విరుద్ధంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీ ముందు ఉంచింది. మంగళవారం ఉదయం 11:45 గంటలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పటికే స్థోమతకు మించి అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో కూడా అప్పులతోపాటు రాని ఆదాయ వనరులను చూపిస్తూ కాగితాలపై భారీగా కేటాయింపులు చేసింది. రూ.2,26,177.53 కోట్ల కేటాయింపులతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను యనమల ప్రవేశపెట్టారు. ఆదాయ వనరులు లేకపోయినా.. ఎన్నికల ముందు ఊహాజనిత గణాంకాలతో భారీగా బడ్జెట్‌ కేటాయింపులు చేసేద్దామనే రీతిలో సర్కారు వ్యవహరిస్తోంది. రూ.2099.47 కోట్లను రెవిన్యూ లోటు కింద.. రూ.32,390 కోట్లను ద్రవ్యలోటు కింద బడ్జెట్‌లో పేర్కొన్నారు.

నవరత్నాలను కాపీకొట్టిన చంద్రబాబు
ఎన్నికల ముందు రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు మరో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్‌ జగన్‌ నవరత్నాలను కాపీకొట్టి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం బడ్జెట్‌లో రూ. ఐదువేల కోట్లు కేటాయించారు. కాగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే  ప్రతి ఏటా రైతులకు రూ.12500 పెట్టుబడి సాయం ఇస్తామని వైఎస్ జగన్‌ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ పథకాన్నే కాపీ కొట్టి రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా రుణమాఫీ అమలు చేయని చంద్రబాబు.. ఎన్నికల నేపథ్యంలో కొత్త హామీని ప్రకటించి మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు అమలు చేసే అవకాశం లేకపోయినా రైతులను మభ్య పెట్టేందుకే బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

పాదయాత్రలో బీసీ కులాలకు ప్రత్యే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు యాదవ, తూర్పుకాపు, మత్స్యకారులతో సహా తదితర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. గత బడ్జెట్‌లో బీసీ కులాలను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం... తాజాగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కార్పొరేషన్లు ప్రకటించింది.

డ్వాక్రా మహిళలకు చంద్రబు మళ్లీ టోకరా
డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తరువాత మాఫీ చేయబోనంటూ చెప్పి, పెట్టుబడి నిధి కింద ఒక్కో మహిళకు పది వేలు ఇస్తామంటూ నాలుగున్నరేళ్ల పాటుగా సాగదీశారు. ఇప్పుడు ఎన్నికల ముందు మరో పది వేలు ఇస్తామంటూ పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌లను పంపిణీ చేస్తూ మోసం చేస్తున్నారు. తాజా బడ్జెట్‌లో కూడా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అన్యాయం చేసింది. వడ్డీలేని రుణాల బాకాయిలు రూ.2,350 కోట్లు ఉండగా, బడ్జెట్‌లో కేవలం రూ.1100 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించింది. వడ్డేలేని రుణాల బకాయిలు చెల్లించొద్దని నిర్ణయించింది. రెండేళ్లుగా వడ్డీలేని రుణాల బాకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు

  • మొత్తం బడ్జెట్ రూ. 2,26,177.53 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ.1,80, 369.33కోట్లు
  • రెవెన్యూ లోటు రూ. 2099.47కోట్లు
  • ఆర్థిక లోటు రూ. 32,390.6 కోట్లు
  • రెవెన్యూ వసూళ్లు, కేంద్ర పన్నులు రూ.36,360 కోట్లు
  • కేంద్రం నుంచి గ్రాంటులు రూ.67,701 కోట్లు
  • రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.75,438 కోట్లు
  • రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ. 5,750 కోట్లు అంచనా
  • పసుపు కుంకుమకు రూ. 4వేల కోట్లు
  • బీసీ కార్పొరేషన్‌కు రూ.3వేల కోట్లు
  • నిరుద్యోగ భృతికి రూ.1200 కోట్లు ( నిరుద్యోగ భృతి రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలకు పెంపు) 
  • వడ్డీలేని రుణాలకు రూ. 1100 కోట్లు
  • అన్నా క్యాంటీన్లకు రూ.300 కోట్లు
  • పెన్షన్ల పథకానికి రూ.1000 కోట్లు
  • ల్యాండ్‌ పులింగ్‌కు రూ.2266 కోట్లు
  • వైద్యారోగ్య శాఖకు రూ. 10,036 కోట్లు
  • హౌజింగ్‌కు రూ. 4,099 కోట్లు
  • పరిశ్రమ శాఖకు రూ.4,194 కోట్లు
  • పంచాయతీరాజ్‌ శాఖకు రూ.35,182 కోట్లు
  • కాపుల సంక్షేమానికి :రూ.1000కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమానికి :రూ.100కోట్లు
  • ఆర్యవైశ్యుల సంక్షేమానికి :రూ.50కోట్లు
  • క్షత్రియుల సంక్షేమానికి : రూ.50కోట్లు
  • మైనారిటీల సంక్షేమానికి : రూ.1,304.43కోట్లు 
  •  దివ్యాంగుల సంక్షేమానికి : రూ.70కోట్లు 
  • ఎస్సీ కాంపోనెంట్ లో కమ్యూనిటీ సౌకర్యాలకు :  రూ.600.56కోట్లు
  • 308కాపు భవనాల నిర్మాణానికి :  రూ.123కోట్లు మంజూరు
  • ఎస్సీ సబ్ ప్లాన్ కు : రూ.14,367కోట్లు( 28% వృద్ది)
  • ఎస్టీ సబ్ ప్లాన్ కు  : రూ.5,385కోట్లు(29% వృద్ది)
  • బీసి సబ్ ప్లాన్ కు  : రూ.16,226కోట్లు(33% వృద్ది)

మరిన్ని వార్తలు