ఉరుకులు.. ఉరుములు

3 Jul, 2015 00:49 IST|Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి జిల్లా పర్యటన
 గురువారం ఏడుగంటల పాటు ఉరుకులు.. పరుగులు అన్నట్టుగా  సాగింది. పుష్కర పనులు, పోలవరం కుడికాలువ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు వ చ్చిన ఆయన ఎక్కడ నిలకడగా ఉండకుండా వడివడిగా పర్యటనను సాగించారు. ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిం చారు. 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఆయన మధ్యలో అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్ర హావేశాలు వ్యక్తం చేస్తూ..  తనదైన శైలిలో హెచ్చరిస్తూ ముందుకు సాగారు.
 
 ఏలూరు :ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. దాదాపుగా ఏడు గంటలపాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, నరసాపురంలో పుష్కర ఏర్పాట్ల తీరును ఆయన మొక్కుబడిగా సమీక్షించారు. దాదాపు అరగంట లోపే సమీక్షలను పూర్తిచేశారు. పర్యటన మొత్తం వచ్చామా... వెళ్లామా అన్నట్టుగా సాగింది. పోలవరం కుడికాలువ పనుల విషయంలో అక్కడ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం పర్యటనలోనే పోలవరం మండలం బంగారమ్మపేటలో ఒక గుడిసెలోకి పోలీస్ జీపు దూసుకు వెళ్లి ఒక వృద్ధురాలు మృతి చెందడంతో పాటు మరో వృద్ధురాలికి తీవ్ర గా యాలైన సంఘటనపై సీఎం స్పందించారు. హోంమంత్రి నిమ్మకాయల  చినరాజప్ప, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను పంపి సమస్య సద్దుమణిగేలా చేశారు.
 
 45 నిమిషాలు ఆలస్యంగా
 సీఎం చంద్రబాబునాయుడు నిర్దేశించిన సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం ఉదయం 11.15 గంటల నరసాపురానికి  చేరుకున్నారు. అక్కడ సబ్‌స్టేషన్  ప్రారంభోత్సవం అనంతరం వలంధర రేవు, లలితాంబఘాట్, గోదావరి గట్టు మీదుగా కారులో ప్రయాణిస్తూ పుష్కర ఏర్పాట్లను గంటకు పైగా పరిశీలించారు. స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో 15 నిమిషాల పాటు పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన చంద్రబాబు మధ్యాహ్నం 1.40 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని భోజనం చేశారు. అనంతరం ప్రాజెక్టుకు చెందిన అతిథిగృహంలో అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై సమీక్ష జరిపి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 3.45 గంటలకు బయలుదేరి దేవరపల్లికి వెళ్లారు.
 
 ఎస్‌ఈపై ఆగ్రహం
 పోలవరం కుడికాలువ పనులను పరిశీలించిన చంద్రబాబుకు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు తనయురాలు పీసీఎల్ కంపెనీ ఎండీ వాణి బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. రూ. 15 కోట్లు చెల్లించవలసి ఉందని తెలిపారు. గతంలో చేసిన పనులకు రూ. 8 కోట్లు బకాయిలు రావలసి ఉన్నాయని  చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం ప్రాజెక్టు ఎస్‌ఈ బి.శ్రీనివాసయాదవ్‌ను పిలిచి మండిపడ్డారు. నీ సంగతి చూస్తాను.. తమాషాగా ఉందా.. నా దగ్గరకు రా అంటూ ఆదేశించారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పెదవేగి మండలం కొప్పులవారిగూడెం వద్ద పోలవరం కుడికాలువ పనులు పరిశీలించారు. జానంపేటలో రాత్రి ఏడున్నర గంటలకు కారులో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
 
 25లోగా చేయకపోతే కాంట్రాక్టు రద్దు
 ఈనెల 25లోగా పోలవరం కుడి కాలువ పనులు పూర్తి చేయకపోతే నీ కాంట్రాక్టు రద్దు చేస్తానని కాంట్రాక్టర్‌ను జానంపేటలో సీఎం హెచ్చరించారు. సీఎం కాంట్రాక్టర్‌ను నిలదీయడంతో ఆయన నీళ్లు నమిలారు.
 
 ఈ పుష్కరాలు చరిత్రలో నిలవాలి : సీఎం
 నరసాపురం అర్బన్ :  2015 పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే పెద్ద సంబరంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నరసాపురంలోని లయన్స్ క్లబ్ హాలులో పుష్కరాల నిర్వహణ, అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. పుష్కరాల అనంతరం ఉభయగోదావరి జిల్లాలు టూరిజం ప్రాంతాలుగా అవతరిస్తాయన్నారు. పుష్కరాల కోసం పశ్చిమగోదావరి జిల్లాకు రూ.550 కోట్లు కేటాయించామన్నారు.  ప్రతి స్నానఘట్టం వద్ద మల్టీ ఫంక్షనల్ బృందాలను ఏర్పాటు చేస్తామని, పుష్కర సిబ్బందికి డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నామని చెప్పారు. మంత్రులు పీతల సుజాత, పైడికొండల మణిక్యాలరావు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, ఎ.రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, గన్ని రామాంజనేయులు, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌రావు, ఎంఏ ఫరీఫ్ నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు