అన్ని జిల్లాల్లోనూ రీ షెడ్యూల్ చేయండి

24 Aug, 2014 03:24 IST|Sakshi

 రేపు ఆర్‌బీఐ గవర్నర్‌తో భేటీలో కోరనున్న ఏపీ సీఎస్

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గత ఖరీఫ్ సందర్భంగా రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు రిజర్వ్‌బ్యాంక్‌ను కోరనున్నారు. ఆర్‌బీఐ సోమవారం ముంబైలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సీఎస్‌తో పాటు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లాం హాజరుకానున్నారు. ఈ సందర్భంగానే ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో భేటీ అయ్యేందుకు కృష్ణారావు సమయం కోరారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లోని 120 మండలాల్లో రీ షెడ్యూల్‌కే అనుమతించారని చెబుతూ.. మిగతా జిల్లాల్లోని మండలాల్లో పంటలు కోల్పోయిన రైతుల రుణాల రీ షెడ్యూల్‌కూ అనుమతించాల్సిందిగా రాజన్‌ను సీఎస్ కోరనున్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శనివారం ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రుణ మాఫీకి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు తదితర అంశాలపై సమీక్షించారు.
 

>
మరిన్ని వార్తలు