ఆంధ్రప్రదేశ్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌

22 Jan, 2020 03:45 IST|Sakshi
అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి

అమ్మ ఒడి పథకంతో ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోంది

యువ సీఎం సారథ్యంలో ప్రతి చిన్నారి ఆనందంగా ఉంటారు

నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి

సాక్షి, అమరావతి: పేద మహిళలకు, వారి పిల్లలకు చేయూతనిచ్చే అమ్మ ఒడి కార్యక్రమాన్ని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు. ఈ కార్యక్రమం అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. కైలాష్‌ సత్యార్థి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో చాలా మంచి సమావేశం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకోసం అందిస్తున్న పలు కార్యక్రమాలు తమ భేటీలో చర్చకు వచ్చాయని తెలిపారు.

వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఎంతో బాగుందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను చైల్డ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌గా ఆయన అభివర్ణించారు. ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశాలున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. యువ ముఖ్యమంత్రి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి చిన్నారి ఆనందంగా ఉంటారని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు తమ సంస్థ తరఫున సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు