బాపూ స్ఫూర్తి.. ప్రగతి దీప్తి

2 Oct, 2019 08:02 IST|Sakshi

పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం

మహాత్ముడి జయంతి రోజునే ప్రారంభం

నేటి సీఎం జగన్‌ సభకు కాకినాడ రూరల్‌ కరపలో పకడ్బందీగా ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పౌర సేవల్లో ఒక విప్లవాత్మకమైన సంస్కరణలకు నాంది పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సీఎం జిల్లాకు వస్తున్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సచివాలయ వ్యవస్థకు తొలి అడుగు మహాత్ముని జయంతి రోజైన బుధవారం వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎం జిల్లాకు వచ్చి వెళ్లారు. గోదావరికి వరదలు, కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయినæ విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచి మనో ధైర్యాన్ని నింపేందుకు సీఎం వచ్చారు. మూడోసారి జిల్లాకు వస్తున్న జగన్‌ ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెస్తున్న ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు రానుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. ‘తూర్పు’ సెంటిమెంట్‌ను బలంగా విశ్వసిస్తూ సచివాలయ వ్యవస్థను జిల్లా నుంచే శ్రీకారం చుట్టేందుకు సీఎం వస్తున్న క్రమంలో కరపలో భారీ ఏర్పాట్లు చేశారు. గడచిన వారం రోజులుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌ సహా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తదితర అధికారులు శ్రమించి కరపలో సీఎం ప్రారంభించనున్న∙ సచివాలయం, సచివాలయ స్థూపం, ఇతర ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. సీఎం వస్తున్నారనే సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానుండటంతో జిల్లా యంత్రాంగం కరప జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇది జిల్లా అదృష్టం
దేశంలో మరే ముఖ్యమంత్రికీ సాధ్యం కాని సాహసోపేతమైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను జిల్లా నుంచి ప్రారంభించనుండటంతో జిల్లా ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు. కరప గ్రామ సచివాలయ ఆవరణలో సిద్ధమైన సచివాలయ పైలాన్‌ (స్థూపం) రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లాలోని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిగలో రాష్ట్ర వ్యాప్త ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను కరపలో శ్రీకారం చుడుతుండడంతో తండ్రీ, తనయులు జిల్లాపై ప్రేమను చాటుకున్నారని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. తొలి విడతలో ప్రతి మండల కేంద్రంలోను బుధవారం ప్రారంభం అవుతుండగా, మిగిలిన సచివాలయాలు ఈ నెల 15వ తేదీకల్లా పూర్తిచేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సచివాలయంలో రెండు కంప్యూటర్లు, పది టేబుళ్లు, 30 కుర్చీలు, ఫైళ్లు భద్రపరిచేందుకు ఐరన్‌ రేక్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు.

కార్పొరేట్‌ తరహా ఫ్రంట్‌ ఆఫీస్‌..
సచివాలయాల్లో కార్పొరేట్‌ కంపెనీల తరహాలో ఆఫీస్‌ తీసుకురాబోతున్నారు. రిసెప్షనిస్ట్‌ మాదిరిగా డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. డిజిటల్‌ అసిస్టెంటే అర్జీని తీసుకుని ప్రాథమిక పరిశీలన చేసి సంబంధిత అధికారికి పంపించాలి. సేవల కోసం వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఏకపక్ష గవాక్ష పద్ధతి (సింగిల్‌ విండో)లో సేవలు అందించాలి. సేవల కోసం ఎవరు ముందు వస్తారో వారి పనులే జరగాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. జనన, మరణాల నమోదు, ఆస్తిపన్ను మదింపు, ఇతర పన్నుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుండాలి. ప్రస్తుతం అమలవుతున్న సాఫ్ట్‌వేర్లను పంచాయతీ కార్యదర్శి అనుమతితో నిర్వహిస్తుండాలి. సచివాలయ ఉద్యోగులు సంబంధిత శాఖల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తుండాలి. ఎప్పటికప్పుడు ఆయా శాఖల ఉన్నతాధికారులు వారి పనితీరుపై సమీక్షలు చేస్తుంటారు.

62 మండలాల్లో నేటి నుంచి అందుబాటులోకి గ్రామ సచివాలయాలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా జిల్లాలో తొలి విడత 62 మండల కేంద్రాల్లో గ్రామ సచివాలయాలు బుధవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెల 15 నాటికి మిగిలిన సచివాలయాలను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఆ సచివాలయాల్లో ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 62 మండలాల్లో 1,271 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా పౌర సేవల కోసం జిల్లావ్యాప్తంగా 13,097 పోస్టుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఇందులో ఇప్పటి వరకూ సుమారు 7,500 మందికి మెరిట్‌ ఆధారంగా నియామక పత్రాలు అందజేశారు. మిగిలిన 5,597 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటిలో ఏఎన్‌ఎమ్, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1527 ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించిన అనంతరం మెరిట్‌ ఆధారంగా ఎంపికలు చేశారు. ఈ పరీక్షకు జిల్లాలో రికార్డు స్థాయిలో 2,06,211 మంది హాజరై చరిత్ర సృష్టించారు. ఎంపికైన వారిలో 60 శాతం మందికి సోమవారమే నియామక పత్రాలు అందజేయగా మిగిలిన వారికి బుధవారం అందజేయనున్నారు.

ఉద్యోగ ఎంపికలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 14 రకాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేయగా..వైద్య ఆరోగ్య శాఖ మినహా మిగిలిన వాటి నియామక ప్రక్రియ పూర్తయింది. 13 విభాగాలకు సంబంధించి 7,734 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా..5,190 మందికి కాల్‌ లెటర్లు పంపారు. ఇందులో 3,855 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. 1335 మంది గైర్హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో 3,560 పోస్టులకుగాను 2,809 మంది హాజరయ్యారు. మార్కులు కలపడం తదితర సమస్యలున్న కారణంగా 1527 ఏఎన్‌ఎం, మెడికల్, హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ ఆగింది. ఈ సమస్యను త్వరలో పరిష్కరించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న పరిస్థితి నుంచి సొంత మండలంలోనే విధులు నిర్వర్తించే అవకాశం రావడంతో ఉద్యోగాలు సాధించిన వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం చారిత్రాత్మకమంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా