భరత్‌..మళ్లీ మెరిశాడు..

20 May, 2018 08:55 IST|Sakshi

 జేఈఈ మెయిన్స్‌లో 8వ ర్యాంకు

 ఆంధ్రా ఎంసెట్‌లో 32వ ర్యాంకు

 తెలంగాణ ఎంసెట్‌లో 6వ ర్యాంకు  

 పోటీ పరీక్షల్లో సత్తాచాటిన వీరఘట్టం కుర్రోడు 

వీరఘట్టం: డాకారపు భరత్‌.. ఈ పేరు జిల్లా వాసులకు గుర్తుండే ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులతో సత్తాచాటుతున్న ఈ సరస్వతీ పుత్రుడు మరోసారి మెరిశాడు. మొన్న జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియాస్థాయిలో 8వ ర్యాంకు సాధించిన భరత్‌..ఆంధ్రా ఎంసెట్‌లో 32వ ర్యాంకు సాధించాడు. తాజాగా శనివారం విడుదలైన  తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో 6వ ర్యాంకుతో మరో సారి తనసత్తా చాటాడు. భరత్‌ తండ్రి రమేష్‌ కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తుండగా, తల్లి లిఖిత గృహిణి. చెల్లెలు ధరణి ఇంటర్‌ చదువుతోంది. భరత్‌ సాధిస్తున్న వరుస విజయాలతో వారింటిలో పండుగ వాతావరణం నెలకొంది.

చదువులో చిచ్చర పిడుగు..
భరత్‌ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు వీరఘట్టం సెయింట్‌ జేవియర్స్‌ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌లో చదివాడు. 2012లో గుంటూరు బాష్యం విద్యాసంస్థలు నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌లో ప్రతిభ కనబరచి ఫ్రీ సీటు సాధించాడు. 6 నుంచి ఇంటర్‌  వరకు గుంటూరు భాష్యంలో చదివాడు. 2016 టెన్త్‌ ఫలితాల్లో 10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించాడు. 2018 ఇంటర్మీడియెట్‌లో 987 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. ఏప్రిల్‌ 30న విడుదలైన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 345/360 మార్కులు సాధించి ఆలిండియాలో ఓపెన్‌ కేటగిరీలో 8వ ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతిని చాటిచెప్పాడు. మే రెండో తేదీన విడుదలైన ఆంధ్రా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో 32వ ర్యాంకు సాధించాడు. తాజాగా శనివారం విడుదలైన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాల్లో 6వ ర్యాంకు సాధించి మరో సారి వార్తల్లో నిలిచాడు.

కలెక్టర్‌ కావాలన్నదే కోరిక.. 
అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు వస్తున్నప్పటికీ తన లక్ష్యం మాత్రం కలెక్టర్‌ కావడమేనని భరత్‌ తన మ నోగతాన్ని వెల్లడించాడు. సివిల్స్‌ రాసి ఐ.ఏ.ఎస్‌ పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని ‘సాక్షి’కి చెప్పాడు.
 

>
మరిన్ని వార్తలు