ఈవీఎం.. ఆ..భయం!

28 Apr, 2019 11:00 IST|Sakshi

న్నికల యజ్ఞం ముగిసింది. ప్రజాతీర్పు ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైంది. ఆ తీర్పు వెల్లడి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నడూ లేనంత సుదీర్ఘంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు జరుగుతుండటం.. మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాకే.. అంటే మే 23న ఓట్ల లెక్కింపునకు ముహూర్తం నిర్ణయం.. మొదటి దశలోనే రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిపోవడం వంటి కారణాలతో ఏకంగా 43 రోజులపాటు ప్రజాతీర్పును తమలో దాచుకున్న ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడాల్సిన పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్‌ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాండ్‌ రూములకు మెజిస్టీరియల్‌ అధికారాలుండే తహసీల్దార్ల నేతృత్వంలో రౌండ్‌ ది క్లాక్‌ భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

ఆ మేరకు దాదాపు అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు తహసీల్దార్ల పర్యవేక్షణలో భద్రత ఏర్పాటు చేశారు.కానీ విశాఖ జిల్లాలో మాత్రం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్‌ను మాత్రమే నియమించారు. వారికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డీటీలను ఇచ్చారు. వారు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని సాక్షి పరిశీలనలో వెల్లడైంది. స్ట్రాంగ్‌ రూములున్న ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో పరిస్థితి చూస్తే.. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఈవీఎంలు కొన్ని ఆరుబయట కనిపించాయి. భద్రతను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు గానీ.. కొన్ని నియోజకవర్గా స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రతా సిబ్బంది జాడ గానీ కనిపించలేదు.

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌–కౌంటింగ్‌ మధ్య 43 రోజుల సుదీర్ఘ విరామం రావడంతో.. అంతవరకు స్ట్రాంగ్‌ రూముల్లో ఉండే ఈవీఎంల భద్రతకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు విశాఖ జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. ఈవీఎంల భద్రతపై సాక్షి పరిశీలన జరిపినప్పుడు ఎన్నికల అధికారుల పర్యవేక్షన, భద్రత లోపాలు స్పష్టంగా కనిపించాయి. పోస్టల్, సర్వీస్‌ బ్యాలెట్ల జారీలోనే కాదు.. ఈవీఎంల భద్రత విషయంలోనూ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేశామని జిల్లా అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ.. నేటికీ సగం మందికి కూడా అందని పరిస్థితి నెలకొంది. పైగా పోస్టల్‌ బ్యాలెట్లు అందిన వారిలో చాలామందికి లోక్‌సభ తప్ప అసెంబ్లీ బ్యాలెట్లు పంపడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఈ తరుణంలో కొత్తగా ఈవీఎంల భద్రతలోని డొల్లతనం అధికారుల ఉదాసీనతను బయటపెడుతోంది.

విశాఖలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లతో సరి
విశాఖ జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మ«ధ్య ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్‌నే ఇన్‌చార్జిగా నియమించారు. వీరికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)ను నియమించారు. దీంతో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద విధి నిర్వహణను డీటీలకు అప్పగించి తహసీల్దార్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కనీసం రోజుకోసారైనా స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలిస్తున్నారా? అంటే.. లేదనే సమాధానం వస్తోంది. పోనీ డీటీలైనా స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఉంటున్నారా? అంటే అదీ లేదని ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమైంది.

శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముల వద్ద పరిస్థితిని ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లిన దాఖలాలు కన్పించలేదు. పర్యవేక్షణాధికారుల గురించి ఇంజినీరింగ్‌ కళాశాల సిబ్బందిని ఆరా తీస్తే.. రెవెన్యూ అధికారులు కాదు కదా.. కనీసం సిబ్బంది కూడా రావడం లేదని ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులే 24 గంటలూ ఉంటున్నారని చెప్పుకొచ్చారు. పైగా కొన్ని నియోజకవర్గాల ఈవీఎంలు ఆరు బయటే పెట్టినట్టుగా కన్పిస్తోంది. వీటిని మరో 25 రోజుల పాటు ఈవీఎంలు కంటికిరెప్పలా కాపాడాల్సి ఉంది. భద్రత, పర్యవేక్షణ ఇలా ఉంటే.. ఎదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈవీఎంల భద్రత, పర్య వేక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు కోరుతున్నారు.

స్ట్రాంగ్‌ రూముల భద్రతకు ఇవీ గైడ్‌లైన్స్‌

ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రతకు ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. 24 గంటలూ పర్యవేక్షించేలా మేజిస్టీరియల్‌  అధికారాలు ఉన్న తహసీల్దార్లను నియమించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు.. ఆ పైస్థాయి అధికారులకే భద్రత పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని స్పష్టంగా సూచిం చింది. కిందస్థాయి అధికారులెవరూ ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది. తహసీల్దార్‌ స్థాయి అధికారులైతేనే స్ట్రాంగ్‌ రూముల వద్ద ఎవరైనా అపరిచితులు సంచరించినా, ఏవైనా అనుకొని ఘటనలు జరిగినా.. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా తమకున్న మేజిస్టీరియల్‌ అధికారాలతో అక్కడికక్కడే.. వెనువెంటనే తగిన చర్యలు చేపట్టే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ ఈ గైడ్‌లైన్స్‌ ఇచ్చింది.

ఎన్నికల సంఘం ఆదేశాలకు తూట్లు
స్ట్రాంగ్‌ రూంల వద్ద భద్రతా సిబ్బందితో కలసి పర్యవేక్షించేందుకు మేజిస్ట్రేట్‌ హోదా కల్గిన తహసీల్దార్లను నియమించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. కానీ మన జిల్లాలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. తహసీల్దార్లు స్ట్రాంగ్‌ రూంల పరిశీలనకు అసలు వెళ్లడం లేదు. డిప్యూటీ తహసీల్దార్లే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు తూట్లు పొడవడమే.– కాండ్రేగుల వెంకటరమణ, అధ్యక్షుడు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య 

తహసీల్దార్లు, ఆర్వోలు పరిశీలిస్తున్నారు
స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు గెజిటెడ్‌ హోదా కల్గిన డిప్యూటీ తహసీల్దార్లను నియమించడం వాస్తవమే. అయితే తహసీల్దార్లు, ఆర్వోలు రోజూ మూడు పూటలుగా వెళ్లి తమ నియోజకవర్గాల స్ట్రాంగ్‌ రూంలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరిగాయి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదు. రౌండ్‌ ది క్లాక్‌ భద్రతను పర్యవేక్షిస్తున్నాం. – ఆర్‌.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి

>
మరిన్ని వార్తలు