కలెక్టర్‌కు షోకాజ్‌ నోటీసు

25 Jun, 2020 13:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌కు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. విద్యుత్‌ కారిడార్‌ వ్యవహారంలో రైతుకు న్యాయం చేయని కలెక్టర్‌పై కమిషన్‌ సీరియస్‌ అయింది. రెండు వారాల్లో సరైన వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్టు ఏపీఈఆర్‌సీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఏపీ ట్రాన్స్‌కో 2017లో పొదిలి–పర్చూరు మధ్య 220 కేవీ విద్యుత్‌ లైన్‌ వేసింది. ఈ క్రమంలో సుబాబుల్‌ సాగు చేస్తున్న వలేటి వెంకట శేషయ్య భూమి మీదుగా లైన్‌ వెళ్లింది. దీనివల్ల 80 సెంట్ల భూమి దెబ్బతింటుందని, పరిహారం ఇవ్వాలని విద్యుత్‌ ఉన్నతాధికారులను కోరాడు. దీనికి వాళ్లు నిరాకరించారు.  అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితుడు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 5న ఆ రైతు ఏపీఈఆర్‌సీని ఆశ్రయించాడు. కమిషన్‌ వివరణ కోరినా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ స్పందించలేదు. దీంతో విద్యుత్‌ నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కలెక్టర్‌కు కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది.

మరిన్ని వార్తలు