నేడు ఏరువాక పౌర్ణమి

5 Jun, 2020 09:56 IST|Sakshi

సాగుకు సిద్ధమవుతున్న అన్నదాత

కలిసొచ్చిన కాలం, సకాలంలో రైతు భరోసా సాయం

గతేడాదికన్నా పెరగనున్న సాగు విస్తీర్ణం  

సాక్షి, అమరావతి: ఏరువాక పౌర్ణమి వచ్చేసింది.. తొలకరి పలకరిస్తున్న వేళ.. నేల తల్లి పులకిస్తున్న వేళ.. రైతన్నలు కాడీమేడీ పట్టి.. కుడి, ఎడమల కోడె దూడలు కట్టి.. నాగలి పట్టి పొలాలు దున్నేందుకు సిద్ధమయ్యే రోజిది. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు మొదలవుతాయి. రైతులు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, పసుపు–కుంకుమతో పశువులను అలంకరించి పొలం పనులు ప్రారంభిస్తుంటారు. ప్రకృతి కూడా సహకరించడంతో అన్నదాతలు శుక్రవారం ఏరువాకకు సిద్ధమయ్యారు. (మరో ఐదు ‘శ్రీసిటీ’లు)

ముందుచూపుతోనే ప్రభుత్వ ప్రోత్సాహం
► రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ ఆరంభానికి ముందే వైఎస్సార్‌ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.
► వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసింది. ఎరువులు, పురుగు మందులను రైతు ముంగిట్లోకి తెచ్చేందుకు సంసిద్ధమై రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. పంట రుణాలు మంజూరు చేయించింది.  
► గతేడాది 36,15,526 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సారి 39,58,906 హెక్టార్లలో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.  
► తొలకరి పలకరింపుతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖరీఫ్‌ ప్రధాన పంటగా సాగు చేసే వేరుశనగను విత్తేందుకు దుక్కుల్ని సిద్ధం చేస్తున్నారు.
► ఈ నెల 10 నుంచి గోదావరి కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నార్లు పోసేందుకు రైతులు సన్నాహాలు ప్రారంభించారు.
► కృష్ణా డెల్టాలో చెరువులు, బావులు కింద నారుమళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

అన్నీ మంచి శకునాలే
4 ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వ్యవసాయ
మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆకాంక్షించారు.  
4 కృష్ణా బేసిన్‌ ఎగువ ప్రాంతంలో మంచి వర్షపాతం నమోదైందని.. మహాబలేశ్వర్‌లో గురువారం ఉదయానికి 212 మి.మీ వర్షం కురిసిందని, ఇది శుభారంభమని తెలిపారు.
 – అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి

రైతులకు మంత్రి కన్నబాబు శుభాకాంక్షలు  
ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌ అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు.   

మరిన్ని వార్తలు