అమ్మకానికి ఆంధ్రా

22 Apr, 2015 03:37 IST|Sakshi

రాజధాని నిర్మించమంటూ చైనా చుట్టూ చంద్రబాబు
శత్రుదేశం పాకిస్థాన్‌తో చైనా కీలక ఒప్పందాలు
విదేశీయుల రహస్య పర్యటనలు అడ్డుకొంటాం: ఎమ్మెల్యే ఆర్కే

 
సాక్షి, గుంటూరు :  డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ దేశస్తుల కానుకలకు ఆశపడి ఆహ్వానించిన సంస్థానాదీశుల చరిత్ర చదువుకున్నామని, ఇప్పుడు చంద్రబాబు రూపంలో చూస్తున్నామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడుతూ, చైనాతో వ్యాపార సంబంధాలకు చంద్రబాబు అర్రులు చాస్తుంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మన శత్రుదేశం పాకిస్తాన్‌తో లక్షల కోట్ల ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకోవటం గమనార్హమన్నారు.

మన రాజధాని నిర్మాణాన్ని చైనా చేతిలో పెట్టటమంటే...మన సెక్రటేరియట్‌లో బాంబు పెట్టి రిమోట్ పాకిస్తాన్ చేతికి ఇవ్వటం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బాబు చర్యలు జాతీయ భద్రతనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయని, దీన్ని ఓ అంతర్జాతీయ కుట్రగా భావించాల్సి వస్తోందనీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారం పేరిట వచ్చి జాతి సంపద కొల్లగొట్టి వందల ఏళ్ళపాటు భరతజాతిని బానిసలుగా మార్చిన చరిత్ర పునరావృతం అవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

ఆయన పార్టీ వారికి సైతం తెలియకుండా ఇటీవల సింగపూర్ బృందం రహస్యంగా పర్యటించిందని, ప్రజా ప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశీయులు అధికార పర్యటనలు ఎలా జరుపుతారని ఆయన ప్రశ్నించారు. ‘రాజధాని ప్రణాళిక సింగపూర్‌లో తయారవుతుంది...చైనా కంపెనీలు ఇక్కడ నిర్మాణాలు, నిర్వహణ చేపడతాయి...లాభాల రూపంలో ఆర్థిక వనరులన్నీ వారి చేతిల్లోకి వెళ్ళిపోతాయి...కార్మిక చట్టాల సవరణతో ఇక్కడి ప్రజలంతా వారికి బానిసలుగా మారిపోతారు...’ ఆధునిక తరహా సామ్రాజ్యవాదానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుందని ఆయన అన్నారు.

వనరుల దోపిడీ, ఆధిపత్య కాంక్షతోనే ఆ రెండు వ్యాపార దేశాలు మనపట్ల కపట ప్రేమ కనబరుస్తున్నాయని ప్రతి ఆంధ్రుడు అర్థం చేసుకోవాలన్నారు. ముందస్తు సమాచారం లేకుండా రాజధాని అంశంపై విదేశీయులు జరిపే పర్యటనలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని ఆర్కే హెచ్చరించారు.

మరిన్ని వార్తలు