వేడుకలు వెలవెల

2 Nov, 2013 04:23 IST|Sakshi
వేడుకలు వెలవెల

సాక్షి, నెట్‌వర్క్: తెలంగాణలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలకు నిరసన సెగ తగలింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు దూరంగా ఉండటంతో సభా ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయితే టీఆర్‌ఎస్ అవతరణదినాన్ని ‘బ్లాక్ డే’గా ప్రకటించగా.. ఉద్యోగుల జేఏసీ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపింది. టీఆర్‌ఎస్, టీజేఏసీ, టీఎస్‌జేఏసీ, టీఎన్‌జీవోస్, తెలంగాణ జాగృతి సంస్థలతోపాటు తెలంగాణ ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో విద్రోహదినంగా పాటిస్తూ నల్లజెండాలు ఎగురవేశారు.
 
 సింగరేణి కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తెలంగాణవాదులు పలుచోట్ల పలు ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలను ఎగురవేశారు. అన్ని జిల్లాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో కలెక్టర్ అహ్మద్ బాబు, జేసీ సుజాత శర్మ, ఎస్పీ భూపాల్ వేడుకల్లో పాల్గొనగా, పరేడ్ గ్రౌండ్‌లో జనం లేకున్నా కలెక్టర్ ప్రసంగించారు. నిజామాబాద్‌లో టీఎన్‌జీవోస్ భవన్ ఎదుట ఉద్యోగ జేఏసీ నాయకులు, జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల జెండాలను ఆవిష్కరించారు. ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, నాగిరెడ్డిపేటలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నల్లజెండాలను ఎగుర వేశారు. జిల్లా కేంద్రంలో అవతరణ వేడుకల్లో జనాలు లేక గ్యాలరీలు బోసిపోగా కలెక్టర్ ప్రద్యుమ్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్‌లోనూ ఇదే పరిస్థితి. ఇన్‌చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తూతూమంత్రంగా కార్యక్రమాన్ని ముగించారు.
 
 వరంగల్‌లో కలెక్టర్ కిషన్ కలెక్టరేట్‌లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి వెళ్తుండగా విద్యార్థులు ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లారు. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 300 మీటర్ల భారీ నల్లజెండాతో మానవహారం ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు, ఉద్యోగులు నల్లజెండా ఆవిష్కరించి అవతరణ దినోత్సవాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. భూపాలపల్లి సింగరేణిలో బొగ్గుబావుల వద్ద టీ బిజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నల్లజెండాలు ఎగురవేశారు.
 
 రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్  ఎదుట నల్లజెండా ఎగురవేయగా,  తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోనికి చోచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. పీఆర్ ఉద్యోగులు భోజన సమయంలో జెడ్పీలో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో జాతీయ, తెలంగాణ జెండాలను ఎగరవేశారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యుడు జితేందర్‌రెడ్డి నల్ల పావురాన్ని ఎగురవేసి నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నల్లజెండాను ఎగురవేశారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు, మేడ్చల్, వికారాబాద్‌లో తెలంగాణవాదులు ర్యాలీలు జరిపి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. జిల్లాలో అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు