కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు

13 Jun, 2019 10:58 IST|Sakshi

ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు 

తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలతో పోలిస్తే వైశాల్యం, జనాభా, గ్రామాలు వంటి అంశాల్లో మన రాష్ట్రంలోని జిల్లాలు చాలా పెద్దవి. ఇందువల్ల అధికార యంత్రాంగంపై పనిభారం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం కూడా కష్టతరమే. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు మరింత సమర్థవంతంగా తీసుకు వెళ్లాలంటే కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమనే భావన చాలా రోజులుగా ఉంది.

తాము అధికారంలోకి వస్తే ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని వైఎస్సార్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. లోక్‌సభ పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజక వర్గాలు,వాటి రిజర్వేషన్లు, మండలాలు, గ్రామాలు, విస్తీర్ణం, జనాభా, ఒకే మండలంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం వంటి వివరాలు పంపాలని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ 
(సీసీఎల్‌ఏ) ఆదేశించారు. ప్రభుత్వం కోరిన వివరాలన్నీ కలెక్టరేట్‌ అధికారులు పంపారు. 

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో కడప, రాజంపేట లోక్‌సభ స్థానాలు ఉన్నందున రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కడప పార్లమెంటు జిల్లా వరకు ఎలాంటి సమస్యలు లేవు. రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై మాత్రం చర్చ నడుస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటితోపాటు చిత్తూరు జిల్లాలోని పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే కోడూరు మినహా ఇంకా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను శేషాచల కొండలు రాజంపేట నుంచి వేరు చేస్తున్నాయి. ఒకవేళ రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే పుంగనూరు ప్రజలు 160 నుంచి 170 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుంది. మదనపల్లె ప్రజలు 130 కిలోమీటర్లు, తంబళ్లపల్లెలోని బి. కొత్తకోట వాసులు 135 కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది. పీలేరు నియోజకవర్గంలోని వాయల్పాడు నుంచి సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అసౌకర్యంగా  ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా వంద కిలోమీటర్లు మించి లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా కేంద్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.

చరిత్రను పరిశీలిస్తే....
ఆనాటి నైజాం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీకి అప్పగిస్తూ 1800 అక్టోబరు 12వ తేదీన ఒప్పందం చేసుకుంది. నవంబరు 1న ప్రిన్సిపల్‌ కలెక్టర్‌గా కల్నల్‌ థామస్‌ మన్రో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి రాయలసీమ, బళ్లారి జిల్లాలను దత్త మండలంగా పిలిచేవారు. 1807లో దత్త మండలాన్ని కడప, బళ్లారి, కొడికొండ జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 1808లో కొడికొండను రద్దు చేసి కడప, బళ్లారి జిల్లాల్లో కలిపేశారు. అప్పటి కడప జిల్లాలో కోవెలకుంట్ల, నొస్సం, దూపాడు, కంభం, గిద్దలూరు, గుర్రంకొండ, పుంగనూరు, బద్వేలు, జమ్మలమడుగు, దువ్వూరు, చిట్వేలి, సిద్దవటం, చెన్నూరు, చింతకుంట, కమలాపురం, పులివెందుల, రాయచోటి తాలూకాలు ఉండేవి. 1856లో కడపజిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుంగనూరు సంస్థానాన్ని ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలో కలిపారు. 1858లో కర్నూలు జిల్లా ఏర్పాటు కావడంతో కడప జిల్లాలోని కోవెలకుంట్ల,  దూపాడు తాలూకాలను ఆ జిల్లాలో కలిపారు. 1910 అక్టోబరు 1న కదిరి తాలూకాను అనంతపురం జిల్లాలో కలిపారు. 1911 ఏప్రిల్‌ 1న   వాయల్పాడు, మదనపల్లె తాలూకాలను కడపజిల్లా నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లాలో కలిపారు. చరిత్రలో ఇలా కడపజిల్లా భౌగోళిక స్వరూపంలో చాలా మార్పులు సంభవించాయి. ఇప్పుడు కొత్తగా రాజంపేట జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభం కావడంతో జిల్లా స్వరూపంలో మరోమారు మార్పులు జరగనున్నాయి.

జిల్లా చిత్రపటంలో పలు మార్పులు
ఒకప్పటి జిల్లా చిత్రపటం నేడు మనం చూస్తున్న విధంగా లేదు. అప్పట్లో వైశాల్యం రీత్యా జిల్లా చాలా పెద్దదిగా ఉండేది. పరిపాలన సౌలభ్యం కోసం కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఆ తర్వాత ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని కొన్ని తాలూకాలను కొత్త జిల్లాల్లో కలుపడం వల్ల జిల్లా ముఖ చిత్రంలో చాలా మార్పులు జరిగాయి.  

ప్రభుత్వానికి నివేదిక
కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో పలు వివరాలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కలెక్టరేట్‌ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి పంపారు. 

కడప పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు...

నియోజకవర్గం మండలాలు గ్రామాలు విస్తీర్ణం జనాభా
బద్వేలు 07 149 2650 2,74,179
కడప 01  11 96 3,18,916
కమలాపురం  06 118 1993 2,49,734
పులివెందుల 07 102  1745 2,87,374
జమ్మలమడుగు  06 148 2062 3,06,323
ప్రొద్దుటూరు 02 30  379 2,91,708
మైదుకూరు 05 92 1798 2,61,868
మొత్తం  34  650 10723 19,90,102

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం

రాజంపేట 06 103 1784 3,06,995
రైల్వేకోడూరు 05 101 1360 2,67,987
రాయచోటి 06 74 1493 3,17,385
మొత్తం 17   278 4637  8,92,367
గ్రాండ్‌ టోటల్‌ 51  928 15360 28,82,469 

  

మరిన్ని వార్తలు