నైపుణ్య శిక్షణలో ఏపీ టాప్‌..

29 Nov, 2019 21:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో అసోచామ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ ఇండియా సమిట్ అండ్ అవార్డ్స్.. అత్యత్తుమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతరాము, స్కిల్ డెవలప్‌మెంట్‌ అండ్ ట్రైనింగ్ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేశారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం  స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి నుంచి ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో అనేక రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.  విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉండడంతో ఇటీవలే యూకే నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇలాంటి అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడం వల్లే అసోచామ్ సంస్థ దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీకి మొదటి స్థానం ఇచ్చి బంగారు పతాకాన్ని ఇచ్చిందన్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని.. రాబోయే రోజుల్లో యవతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు.

అనంతరాము మాట్లాడుతూ.. దేశంలో అత్యత్తుమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీని నెంబర్‌వన్‌ గా అసోచామ్ సంస్థ గుర్తించి బంగారు పతకాన్ని ప్రధానం చేయడం ఆనందంగా ఉందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని.. ఇందుకోసం విద్యావిధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.స్థానికంగా యువతకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం కోసం అవసరమైన విధంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ యూనివర్సిటీ, 25 మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. చదువుతోపాటు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో పరిశ్రమలు కూడా  భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసకుంటామన్నారు. 

అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ 6 నెలల కాలంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ శిక్షణా కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జరిపిన సర్వేలో 7 ఇండస్ట్రియల్ జోన్లను గుర్తించామని.. ఆ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉండే ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ దిశగా ఇప్పటికే పరిశ్రమలశాఖ, విద్యాశాఖ, ఆర్థికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన పీఎంకేవీవై, ఈసీడీఎం, బ్యాంబు మిషన్,  కోయిర్ బోర్డు, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి) పథకాలను అమలు చేస్తూ నిధులను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 525 డిగ్రీ కాలేజీల్లో ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ సెంటర్లు (ఈ.ఎస్.సి)లను ఏర్పాటు చేసి పైథాన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 

నాన్ టెక్నికల్ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయన్నారు. గత వారం రోజుల్లో విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన అర్హత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ పొందిన 662 మంది ఉద్యోగాలు సాధించారని.. గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ త్వరలో ఇన్ఫోసిస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతున్నామని అర్జా శ్రీకాంత్ తెలిపారు.  ఇంకా ఈ మీడియా సమావేశం ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హనుమ నాయక్, బి. నాగేశ్వరరావు, సీజీఎం టెక్నికల్ రవి గుజ్జుల, సీజీఎం కార్పొరేట్ కనెక్ట్ సత్యప్రభ, కంపెనీ సెక్రెటరీ పవన్ కుమార్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా