రాజధాని భూముల అవినీతిపై సిట్‌ ఏర్పాటు

21 Feb, 2020 22:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం గత  ప్రభుత్వ హాయాంలో చోటుచేసుకున్న రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై లోతైన విచారణ జరుపనుంది. రాజధాని వ్యవహారాల్లో జరిగిన న్యాయ, ఆర్థిక పరమైన అక్రమాలపైనా సిట్‌ విచారణ చేయనుంది. విశాఖపట్నం ఎస్పీ బాబుజి, ఇంటెలిజెన్స్ ఎస్పీ అట్టడా అప్పలనాయుడులతో పాటు మరో నలుగురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను సిట్‌ సభ్యులుగా నియమించింది.

అమరావతిలో చోటుచేసుకున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భూముల లావాదేవీలపై కూడా విచారించనుంది. అలాగే టీడీపీ నేతలు అక్రమించిన భూములను రాజధాని పరిధిలోకి తెస్తూ చేసిన అక్రమాలపై కూడా సిట్‌ విచారించనుంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను విచారించి, పరిశోధించి, క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా సిట్‌కు కట్టబెట్టింది. ఈ క్రమంలో అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాగా రాజధాని భూముల అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారం ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు