ఏపీ పోలీసుల్లో పెరుగుత్ను అసహనం..!

20 Jan, 2019 09:21 IST|Sakshi

పెరిగిన పని ఒత్తిడితో పోలీసుల్లో పెరుగుతున్న అసహనం

తెలంగాణలో వీక్లీఆఫ్,షిఫ్ట్‌ సిస్టమ్‌కు ఆమోదం

రాష్ట్రంలో మాత్రం ప్రతిపాదనలకే పరిమితం  

సాక్షి, అమరావతి: పోలీసుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. విధి నిర్వహణతో పాటు రాజకీయ ప్రయోజనాలకు వారిని ఎడాపెడా వాడేస్తూ.. వారి బాగోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. వారాంతపు సెలవు(వీక్లీ ఆఫ్‌), 8 గంటల పని విధానం(షిఫ్ట్‌ సిస్టమ్‌) వంటి కీలక ప్రతిపాదనలన్నీ పేపర్లకే పరిమితమైపోయాయి. దీంతో పోలీసుల్లో అసహనం పెరుగుతోంది. మరోవైపు ఇదే విషయమై ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు వీక్లీఆఫ్‌ ఇవ్వడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో కంగారుపడిపోయిన సీఎం చంద్రబాబు హడావుడిగా హోంగార్డులకు వేతనాల పెంపు, కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించి వారితో సన్మానాలు చేయించుకున్నారు. ఇలాంటి తాత్కాలిక తాయిలాలతో ఇంకెంత కాలం మభ్యపెడతారని పోలీసులు మండిపడుతున్నారు. వీక్లీఆఫ్, షిఫ్ట్‌ సిస్టమ్‌ వంటి కీలక విషయాలను పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం అక్కడి పోలీసులకు వీక్లీఆఫ్, షిఫ్ట్‌ సిస్టమ్‌ అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఈ విధానం సక్సెస్‌ కావడంతో ఇక తెలంగాణ అంతటా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రం పోలీసుల సంక్షేమానికి ఇంత ప్రాధాన్యమిస్తుంటే.. ఇక్కడ మాత్రం విధి నిర్వహణతో పాటు రాజకీయ అవసరాలకు వినియోగించుకొని తమ బాధలు పట్టించుకోవడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అమలుకాని నండూరి ప్రతిపాదనలు..
రాష్ట్రంలో ట్రాఫిక్‌ విధులు, వీఐపీ బందోబస్తు, శాంతిభద్రతల గస్తీలో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేసేలా గత డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదనలు చేశారు. ప్రతి జిల్లాలోనూ సర్కిల్‌ పోలీస్‌స్టేషన్ల వారీగా సిబ్బంది, విధులు వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని సౌలభ్యత ఆధారంగా వీక్లీఆఫ్‌లివ్వాలని ప్రతిపాదించారు. ప్రకాశం జిల్లాలో 2017 జూలై నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రమంతా అమలుచేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు.  

8 గంటల పని విధానమేది?
పోలీసు శాఖలో రోజుకు 8 గంటల పని విధానం(షిఫ్ట్‌ల వారీగా) కూడా అమలు కావడంలేదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోజుకు 8 గంటల చొప్పున శెలవులు పోను ఏడాదిలో 244 రోజులు పనిచేయాల్సి ఉంది. కానీ 8 గంటల పని విధానంతో నిమిత్తం లేకుండా ఏడాదంతా ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీకి పరుగులు తీయాల్సి వస్తోంది. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కూడా సకాలంలో ఇవ్వడంలేదని పోలీసులు వాపోతున్నారు. రాజధాని ప్రాంతానికి బందోబస్తుకు వస్తే కనీస వసతులు కూడా కల్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు