రైతుకు వెన్నుదన్నుగా ప్రభుత్వం

24 Apr, 2020 12:46 IST|Sakshi
ఉద్యానవనశాఖ ప్రత్యేక అనుమతితో జామకాయల ఎగుమతి

ఉత్పత్తుల కొనుగోలుకు చర్యలు  

వ్యవసాయ పనులకు అనుమతులు  

ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు  

ఏలూరు(మెట్రో) /ఏలూరు రూరల్‌:  కరోనా మహమ్మారి వల్ల అన్నదాత కుదేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులు విక్రయించుకునేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాన ఆదాయ వనరు ఆక్వా పరిశ్రమ. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి ప్రత్యేకించి జిల్లాలో అధికారులతో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమావేశాన్ని నిర్వహించారు. ఆక్వా ఎగుమతులకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 18 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా జిల్లాలో రొయ్యల సాగు చేసిన రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేపట్టింది. జిల్లాలో 2195.16 హెక్టార్లలో రొయ్యలు సాగవుతున్నాయి. 15 రోజుల నుంచి ఇప్పటి వరకూ సుమారు 600కు పైగా రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ యూనిట్లకు అమ్ముకున్నారు.

అలాగే  
జిల్లావ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 1.67 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. అలాగే 46 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 1,037 హెక్టార్లలో వేరుశనగ, మెట్టప్రాంతంలో 17,949 హెక్టార్లలో పొగాకు సాగు చేపట్టారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ వ్యవసాయ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఉద్యాన పంటల వ్యవసాయ పనులకు, ఉత్పత్తుల రవాణాకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో 12 వేల హెక్టార్లలో  అరటి, 6 వేల హెక్టార్లలో నిమ్మ, 1700 హెక్టార్లలో జామ, 6,700 హెక్టార్లలో మామిడి, 860 హెక్టార్లలో బొప్పాయి, 473 హెక్టార్లలో సపోటా, 16వేల హెక్టార్లలో జీడిమామిడి, 20 వేల హెక్టార్లలో కోకో, 24 వేల హెక్టార్లలో కొబ్బరి, 68 వేల హెక్టార్లలో ఆయిల్‌ఫామ్, 6 వేల హెక్టార్లలో కూరగాయల సాగుకు వెసులుబాటు కలిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అంచనా వేశారు. ఏ గ్రేడు రకం రూ.1835, బీ గ్రేడు రకం రూ.1815 క్వింటాలుకు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నారు. 77 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. క్వింటాకు రూ.1760 చెల్లించనున్నారు. 

ప్రభుత్వం ఆదుకుంది  
ఏలూరు మండలం మానూరులో 5 ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టాను. రూ.20 లక్షల పెట్టుబడి పెట్టాను. సరిగ్గా అమ్మకాలు చేపట్టే సమయంలో లాక్‌డౌన్‌ వచ్చింది. కలెక్టర్, మత్స్యశాఖ అధికారులు ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా నా నుంచి 3.50 టన్నుల రొయ్య కొనుగోలు చేశారు. లేదంటే నేను అప్పులు పాలయ్యేవాడ్ని.  –మందపాటి కిశోర్‌ప్రసాద్, ఆక్వా రైతు 

మరిన్ని వార్తలు