హోంగార్డుల జీతాలు పెంపు

13 Oct, 2019 04:05 IST|Sakshi

రోజువారీ వేతనం రూ.600 నుంచి రూ.710

హామీ నిలబెట్టుకున్న జగన్‌ సర్కారు

సాక్షి, అమరావతి : హోంగార్డుల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక హోంగార్డుల వేతనాలు పెంచుతామని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై జూన్‌ 10వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హోంగార్డుల వేతనం పెంపు నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తూ ప్రస్తుతం ఉన్న రోజువారీ వేతనం రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో హోంగార్డుల నెలసరి జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరుగుతుంది. పెంచిన వేతనం ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 16,616 మంది హోంగార్డులకు మేలు కలుగుతుంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.గోవిందు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మేలును ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు.  

మరిన్ని వార్తలు