అంగన్‌వాడీల్లోనూ ‘నాడు – నేడు’ 

4 Jun, 2020 19:40 IST|Sakshi

ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు

పిల్లలు, తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం నాణ్యత పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీల్లోనూ ‘నాడు-నేడు’ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. అలాగే అంగన్‌వాడీల్లో గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు ఇతర అధికారులు హాజరు అయ్యారు.

ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగానే అంగన్‌వాడీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కూళ్లలో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, అదే తరహాలో అంగన్‌వాడీల్లో కూడా నాడు – నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని,  ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఫ్రిజ్, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్‌ బోర్డులు, ప్రహరీగోడ సహా కావాల్సిన మరమ్మతులు చేసి, సదుపాయాలను కల్పించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. (టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్)

అలాగే అంగన్‌వాడీల్లో నాడు – నేడు కార్యక్రమాలపై విద్యాశాఖతో కలిసి పని చేయాలన్న ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు,  వాటిలో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే భవనాల్లేని చోట్ల, 31వేల అంగన్‌వాడీల నిర్మాణానికి అంచనాలు కూడా రూపొందించాలన్నారు. అంగన్‌వాడీ స్కూళ్లన్నీ కూడా ప్రీ స్కూల్‌ తరహా విధానంలోకి రావాలని, అలాగే అంగన్‌వాడీల్లో గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, మంచి పౌష్టికాహారాన్ని తల్లులకు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. (టీచింగ్ ఆసుపత్రులకు కొత్త హంగులు)

గత ప్రభుత్వం హయాంలో తల్లులు, పిల్లలకు పౌష్టికాహారంపై కేవలం రూ.740 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019–2020లో రూ.1100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీన్ని మరింతగా పెంచి ఈ ఏడాదిలోనే రూ.1862 కోట్లకు పైగా  ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ తెలిపారు. పటిష్టంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి జూలైలో తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బకాయిలు లేకుండా గ్రీన్‌ ఛానల్‌లో చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. (నాడు-నేడు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది..)

మరిన్ని వార్తలు