రికార్డుల టాంపరింగ్‌ జరిగింది: డీజీపీ

18 Jun, 2017 18:38 IST|Sakshi
విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ విచారణ

అమరావతి : విశాఖ జిల్లా మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో భూముల రికార్డులు తారుమారు(టాంపరింగ్‌) అయినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీజీపీ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం నుంచి దర్యాప్తు చేపడుతుందని చెప్పారు. భూముల అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించిన సమావేశంలో సిట్‌ దర్యాప్తు, రికార్డుల టాంపరింగ్‌పై తీసుకోవాల్సిన చర్యలను వివరించారని డీజీపీ చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో డీజీపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిట్‌ విచారణకు ముందే తాము ప్రాథమిక సమాచారం సేకరించామని చెప్పారు. భూముల రికార్డుల తారుమారు, అక్రమాలపై ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయన్నారు.

మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు చెందిన భూములకు సంబంధించి 25 రికార్డులు తారుమారు(టాంపరింగ్‌) జరిగినట్టు గుర్తించమన్నారు. మధురవాడలో 178 ఎకరాలు, కొమ్మాదిలో 92 ఎకరాలు మొత్తం 270 ఎకరాలకు సంబంధించిన రికార్డులు తారుమారు చేశారని చెప్పారు. వాటిలో 265 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా, మరో 5 ఎకరాలు ప్రైవేటు భూములు అన్నారు. వన్‌బి రికార్డుల్లో టాంపరింగ్‌ చేసినట్టు గుర్తించిన 29 మంది జాబితాను కూడా డీజీపీ మీడియాకు విడుదల చేశారు. భూముల రికార్డులు తారుమారైనట్టు తేలిందని, అయితే ఆ భూములను ఎవరూ ఆక్రమించలేదని, రిజిస్ట్రేషన్‌(ఈసీ)లో కూడా ఎవరి పేర్లు లేవని గుర్తించామన్నారు. బ్యాంకు రుణాల కోసమే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నామని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పిన భూ కుంభకోణానికి రికార్డుల టాంపరింగ్‌కు సంబంధంలేదని, ఆయన ఇచ్చే ఆధారాలను బట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. సిట్‌ లోతైన విచారణలో ఇంకా అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

రెండు నెలల్లో నివేదిక..
గతంలో సీబీఐ డీఐజీగా పనిచేసిన 2001 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు నేతృత్వం వహిస్తారన్నారు. ఆయనతోపాటు విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సృజన, ఆర్డీవో విజయసారధి, మరో అధికారి ఈ టీమ్‌లో సభ్యులుగా ఉంటారని డీజీపీ చెప్పారు. రెండు నెలల్లో ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా దర్యాప్తు చేస్తుందన్నారు. భూముల రికార్డులను ఆన్‌లైన్‌ చేయడంలో భాగంగా ఇటీవల విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ టాంపరింగ్‌ జరిగిన విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారని చెప్పారు.

అయితే భూముల రికార్టులు ఎందుకు టాంపరింగ్‌ చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎప్పటి నుంచి జరిగింది? అనే వివరాలు సిట్‌ దర్యాప్తులో తేలనుందని చెప్పారు. సిట్‌ అధికారులకు సమాచారం అన్ని కోణాల్లో అందించేలా వాట్సాప్‌ గ్రూప్, మెయిల్‌ వంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా, బాధితులు ఎవరైనా తమ వద్ద ఉన్న సమాచారాన్ని సిట్‌కు అందించి దర్యాప్తునకు సహకరించాలని డీజీపీ కోరారు. భూముల వ్యవహారాన్ని వివాదం చేసి విశాఖకు ఉన్న మంచి పేరును చెడగొట్టవద్దని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు