రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లు 

13 Jul, 2020 04:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీకి ప్రభుత్వం ఏర్పాట్లు 

ఇప్పటికే కార్డుల మ్యాపింగ్‌ పూర్తి  

అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా బియ్యం పంపిణీ  

సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యాన్ని పేదల ఇళ్లకే డెలివరీ చేసేందుకు రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,488 క్లస్టర్లున్నాయి. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో 50 నుంచి 75 కుటుంబాలుండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకు, అవినీతికి తావులేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో క్లస్టర్‌లో ఒక్కో గ్రామ వలంటీర్‌ సేవలందిస్తారు. వలంటీర్లు బియ్యం కార్డుల మ్యాపింగ్‌ను దాదాపుగా పూర్తిచేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన శ్రీకాకుళం జిల్లాలో లబ్ధిదారులు గడప దాటకుండానే సరుకులు సకాలంలో వారి ఇంటికే చేరుతున్నాయి. ఈ విధానం మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.  

► క్లస్టర్‌ పరిధిలో ఉన్న కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఎదుటే నాణ్యమైన బియ్యం తూకం వేసి పంపిణీ చేస్తారు. 
► ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 13,370 మొబైల్‌ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి.  
► ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అయ్యే అదనపు ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 
► ఈ విధానం అందుబాటులోకొస్తే 1.49 కోట్ల కార్డుదారులందరికీ రెండు మూడు రోజుల్లోనే సరుకులందుతాయి.  
► రవాణాలో బియ్యం కల్తీ చేయకుండా గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపైనా ప్రత్యేకంగా స్ట్రిప్‌ సీల్, బార్‌ కోడ్‌ ఉంటాయి.  
► క్లస్టర్ల వివరాలను గ్రామ సచివాలయాల నుంచి తీసుకుని, వాటి ఆధారంగా బియ్యం కార్డులను కేటాయిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు