కోవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు

23 Mar, 2020 05:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్‌–19ని మహమ్మారిగా ప్రకటించడంతో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జీవో జారీ చేసింది. అవి..  
- అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద స్క్రీనింగ్‌ చేయాలి. 
- సాధారణ సమావేశాలు వాయిదా. అత్యవసర సమయంలోనే సమావేశాలు. 
- అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధి నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి.  
-  ప్రజారవాణా వాహనాలు, ప్రైవేటు వాహనాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల మూసివేత. 
- అత్యవసర సేవలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. నిత్యావసరాలను ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు. జిల్లాల కలెక్టర్లు ధరలు నిర్ణయిస్తారు. అధిక ధరలకు అమ్మితే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. 
-  ప్రభుత్వం రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులతో పనిచేయిస్తుంది. 
- ప్రతి పేద కుటుంబానికి ఈ నెల 29న రేషన్‌ సరుకులను కేజీ పప్పుతోపాటు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. 
- ఏప్రిల్‌ 4న రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి రూ.1,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తారు.  
- ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఐసొలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. 
- ప్రతి జిల్లా కేంద్రంలో హై ఎండ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం 200 పడకల సెంటర్‌ ఏర్పాటు 
- ఎవరికైనా గొంతు నొప్పి, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినవారు, వారితో కలిసిన వారు ఈ లక్షణాలతో బాధపడితే వెంటనే 104కి ఫోన్‌ చేస్తే డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారు. 
- పదో తరగతి పరీక్షలు యధావిధిగా జరుగుతాయి. దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారికి వేరే రూములు కేటాయిస్తారు.  
- సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్స్, సోషల్‌ ఈవెంట్‌ సెంటర్లు, బంగారం షాపులు, బట్టల దుకాణాలను ఈ నెల 31 వరకు మూసివేస్తారు.   
- ఆటోలు, ట్యాక్సీలను అత్యవసర సమయంలో మాత్రమే వినియోగించాలి. అప్పుడు కూడా కేవలం ఇద్దరిని మాత్రమే ఎక్కించుకోవాలి. 
- విదేశాల నుంచి వచ్చే వారంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 
- పోలీసులు విదేశాల నుంచి వచ్చిన వారిపై గట్టిగా పర్యవేక్షణ చేయాలి.  
- అత్యవసర, నిత్యావసరాలు.. పెట్రోల్, గ్యాస్, ఔషధాల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణా షాపులు తెరిచే ఉంటాయి.  

ధరలు పెంచితే కేసులు: సీఎస్‌ 
నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, నిర్ణయించిన ధరలకు మించి అమ్మితే పోలీసు కేసులు నమోదుచేయాలని చీఫ్‌ సెక్రెటరీ నీలం సాహ్ని ఆదేశించారు. కరోనాపై ఆదివారం రాత్రి ఆమె జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

మరిన్ని వార్తలు