భూతంలా జలయజ్ఞం!

26 Jun, 2014 21:09 IST|Sakshi

హైదరాబాద్: జలయజ్ఞాన్ని భూతంలా చూపించి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగానే సాగునీటి రంగంపై శ్వేతపత్రం రూపొందించడానికి కసరత్తు కొనసాగిస్తోంది. శ్వేతపత్రం రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మీద నిందలు మోపే విధంగా శ్వేతపత్రాన్ని రూపొందించాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ముగింపు దశలో ఉన్న పులిచింతల, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ వంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉన్నా వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వీటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఫలితాలు అందుతాయి. అలాంటి ప్రాజెక్టుల పనుల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం జలయజ్ఞాన్ని భూతంలా చూపించాలని తాపత్రయపడుతోంది. ఇదే తపన ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడంపై చూపిస్తే వేలాది ఎకరాలకు నీరు అందేది.

గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా పైసా ఇవ్వని విషయం తెలిసిందే. అయితే సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇదే జలయజ్ఞంపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంపై అధికారుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు