‘దేశం’ జమానాలో రాష్ట్రం దివాలా

11 Jul, 2019 15:32 IST|Sakshi

ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం

టీడీపీ సర్కారు హయాంలో నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు

ఒక శాఖ నుంచి మరో శాఖకు అక్రమంగా నిధుల మళ్లింపు

తెచ్చిన రూ.లక్షన్నర కోట్లకు పైగా అప్పులు హారతి కర్పూరం

 వివిధ రంగాలకు చెల్లింపులు లేక భారీగా పేరుకుపోయిన బకాయిలు 

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 22.22 శాతం నుంచి 28.18 శాతానికి చేరిన అప్పుల వాటా

టీడీపీ సర్కారు నిర్వాకంతో పుట్టే ప్రతి పిల్లాడితో సహా ప్రతి ఒక్కరిపై రూ.42,500 అప్పు

అప్పులు, బకాయిల భారం కొత్త ప్రభుత్వం పైనే...

గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. నిధుల వినియోగంలో టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బిల్లుల చెల్లింపులో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) జోక్యం చేసుకుంది. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక రంగం పూర్తిగా క్షీణ దశకు చేరుకుంది. టీడీపీ సర్కారు కొత్త ప్రభుత్వానికి ఖాళీ ఖజానా, భారీగా అప్పుల కుప్పను మాత్రమే అప్పగించింది. గత ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ ఏకంగా రూ.వేల కోట్ల బకాయిల భారాన్ని కొత్త ప్రభుత్వంపై నెట్టేసింది. రూ.లక్షల కోట్ల అప్పులను తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ సొమ్ముతో ఏదైనా సాధించిందా? అంటే సమాధానం శూన్యం. ఆస్తుల కల్పన, మానవ వనరుల అభివృద్ధికి ఆ సొమ్మును ఖర్చు చేయాల్సి ఉండగా, సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న వ్యవహారాలు, అవకతవకలపై కొత్త ప్రభుత్వం బుధవారం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా నడిపిస్తామని శ్వేతపత్రంలో వాగ్దానం చేసింది. అవినీతి రహిత, పారదర్శక పాలన కచ్చితంగా అందిస్తామని స్పష్టం చేసింది. దిగజారిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పరంగా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలను కోరింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

గత ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో మే 31, 2019 నాటికి 18,375 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు పెట్టింది. అత్యంత కీలకమైన విద్యుత్‌ రంగాన్ని నష్టాల నుంచి గట్టించడానికి  2018–19 ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకారం 7,983.39 కోట్ల రూపాయలు అవసరం ఉండగా కేవలం బడ్జెట్‌లో 2,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ఎన్నికల ముందు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి 1,250 కోట్ల రూపాయలనే విడుదల చేశారు. దీంతో విద్యుత్‌ రంగం నష్టాల్లో కూరుకుపోయింది. 2019 మార్చి 31 నాటికి విద్యుత్‌ బకాయిలు రూ.18,375 కోట్ల మేర పేరుకుపోయాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఎన్‌టీపీసీ విద్యుత్‌ సరఫరా నిలిపేసే స్థితికి విద్యుత్‌ రంగాన్ని గత ప్రభుత్వం దిగజార్చింది. ప్రతీ నెలా ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లడంతో రాష్ట్ర పరపతిని దిగజార్చింది. ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. దీంతో వడ్డీల భారం భారీగా పెరిగిపోయింది. నిధులు వినియోగంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక శాఖ నుంచి మరో శాఖకు అక్రమంగా నిధులు మళ్లించారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాఖ బ్యాంకుల నుంచి అప్పు చేసిన రూ.4,800 కోట్లను టీడీపీ సర్కారు ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. అలాగే ఫౌరసరఫరాల సంస్ధకు సబ్సిడీ రూపేణా బడ్జెట్‌లో కేటాయించిన రూ.3,000 కోట్లను విడుదల చేయనందున ఈ సంస్థ ఆర్థిక స్థితి క్షీణించింది. ఎన్నికల ముందు ఖజానా నుంచి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఓట్లు కొనుగోలు కోసం పసుపు– కుంకమ పేరుతో కుమ్మరించారు. ఇలాంటి చర్యలతో వివిధ రంగాలను ఆర్థికంగా దెబ్బతీశారు. ట్రెజరీ కంట్రోల్‌ను ఒక ప్రైవేట్‌ చేతికి అప్పగించారు. పీఏవో, వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌కు సంబంధం లేకుండా బిల్లుల చెల్లింపు జరిగింది. బిల్లుల చెల్లింపులో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, ఏ బిల్లు చెల్లించాలో ఏ బిల్లు చెల్లించకూడదో ఆదేశాలు ఇవ్వడం కొనసాగింది. ఇది రాష్ట్ర చరిత్రతో తొలిసారి. టీడీపీ సర్కారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని స్థితికి దిగజార్చింది. అప్పుల భారాన్నీ భారీగా పెంచేశారు.

2014లో రూ.1.48 లక్షల కోట్లుగా ఉన్న అప్పులను రూ.2.58 లక్షల కోట్లకు పెంచేశారు. దీనికి అదనంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో గ్యారెంటీలు ఇవ్వడం ద్వారా మరో రూ. 57 వేల కోట్ల అప్పుల భారం మోపారు. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ రంగాలకు వెచ్చించడంతో ఎటువంటి అభివృద్ధీ జరగకపోగా అప్పుల భారం రెండింతలైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 22.22 శాతం నుంచి 28.18 శాతానికి పెరిగింది. గత సర్కారు ఇష్టానుసారం చేసిన అప్పులతో పుట్టే ప్రతీ  పిల్లాడితో సహా ప్రతి ఒక్కరిపై  రూ.42,500 అప్పు ఉంది.  అలాగే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పీవీ), ఇతర కంపెనీల పేరు మీద చేసిన  రుణాలను తీసుకుంటే ప్రతీ ఒక్కరిపై అప్పు ఒక లక్ష రూపాయలు దాటుతుంది. అంటే జీవితాంతం ప్రతీ ఏటా వడ్డీ రూపంలో పది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.  

అప్పుల గుప్పిట్లో వ్యవసాయ కుటుంబాలు  
గత ప్రభుత్వం ఎన్నికల్లో మొత్తం వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చింది. దాని ప్రకారం చూస్తే మార్చి 31, 2014 నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం అనేక నిబంధనలు, షరతులు విధించి కేవలం రూ. 24 వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ ఈ మొత్తంలో ఇంకా రూ. 8,500 కోట్లు రైతులకు చెల్లించలేదు. 2016–17 నాబార్డుకు చెందిన జాతీయ గ్రామీణ ఆర్థిక సమ్మిళత సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల అప్పులు దేశ సగటుతో పోల్చితే రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని తేలింది. జాతీయ సగటు వ్యవసాయ కుటుంబాల అప్పులు 47 శాతం ఉంటే రాష్ట్రంలో మాత్రం 77 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీని ఎంత అపహాస్యం చేసిందో అర్థం అవుతుంది. రైతులను రుణ భారం నుంచి బయట వేయకుండా మరింత రుణాల ఊబిలోకి నెట్టేసినట్లు స్పష్టం అవుతోంది.

10.32 శాతం వడ్డీ రేటా?   
గత టీడీపీ సర్కారు నూతన రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే గడిచిన ఐదేళ్లలో కేవలం స్పల్ప మొత్తాన్ని వ్యయం చేశారు. ఇదే సమయంలో బహిరంగ మార్కెట్‌లో అధిక వడ్డీ రేటుకు రుణాలను సేకరించారు. ప్రభుత్వ డిపాజిట్లపై 7 శాతం కన్నా తక్కువ వడ్డీ  రేటు ఉంటే సీఆర్‌డీఏ ఏకంగా 10.32 శాతం వడ్డీ రేటుకు బాండ్ల ద్వారా నిధులను సేకరించింది. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ స్పందన మాత్రం నామమాత్రంగానే వచ్చింది. గత ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు విశ్వాసం లేదనడానికి ఇదొక నిదర్శనం. బడ్జెట్‌లో పరిమితికి మించి రుణాలు (రూ.60 వేల కోట్లు) కన్పిస్తున్నాయి.
 
టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్వీర్యం  
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు పేదరికం గణనీయంగా తగ్గింది. 2010 నాటికి రాష్ట్రంలో పేదరికం రికార్డు స్థాయిలో 9.2 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పేదరికం జాతీయ స్థాయిలో 21.92 శాతంగా ఉంది. ఈ ప్రయోజనాలను గత ఐదేళ్ల పాలనలో ధ్వసం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఇప్పుడు ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోవడం, కనీసం సౌకర్యాలు లేకుండా మురికివాడలు భారీగా పెరగడం, గ్రామీణ, పట్టణాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం విద్య వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేయడం, సచివాలయం నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ విభాగాలను బలహీన పర్చడం జరిగాయి. వీటి అన్నింటినీ తిరిగి గాడిన పెట్టడమే ఇప్పటి ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అలాగే మానవ సూచికల్లో రాష్ట్ర ర్యాంకు దిగువ స్థాయిలో ఉంది.

ప్రధానంగా మహిళా అక్షరాస్యత, మాతా శిశు మరణాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. పౌష్టికాహార లోపాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ మానవ సూచిక ర్యాంకును దిగజార్చాయి. సహజ వనరులతో పాటు యువత తగినంత ఉన్నందున వారికి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ప్రతీ సవాల్‌ను అవకాశంగా తీసుకుంటూ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా నడిపించడానికి పక్కా ప్రణాళికతో కొత్త ప్రభుత్వం వెళ్తోంది. ఇందుకోసం నూతనమైన అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు, పేదవాడి నుంచి ధనికుడి వరకు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, మైనారిటీతో పాటు ఇతర కులాలందరికీ నమ్మకం కలిగే విధంగా కొత్త వ్యవస్థ రూపొందుతోంది. ఈ వ్యవస్థలో ప్రతీ ఒక్కరు తమకు రావాల్సిన అవకాశాలను పొందుతున్నామనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుతారు. స్వల్ప కాలంలోనే ప్రజల ఆకాంక్షలు ఆశలను నెరవేర్చే దిశగానే కొత్త ప్రభుత్వం అడుగులు వేసింది.  

వ్యవసాయం తిరోగమనం
గత ఐదేళ్లు వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి సాధిస్తున్నామనే ప్రచారం డొల్లతనమేనని తేలింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో (2004–2009) వ్యవసాయరంగం 5.70 శాతం వృద్ధిని నమోదు చేస్తే గత ఐదేళ్ల కాలంలో వ్యవసాయం రంగ వృద్ది 4.12 శాతం క్షీణించింది. ఇంత కాలం ఎటువంటి ప్రాతిపదిక లేని పశు సంవర్థక, మత్స్య సంపద అధిక వృద్ధిని చూపించడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినట్లు ప్రచారం చేశారు. ఐదేళ్లలో పశుసంవర్దక శాఖలో 14.26 శాతం, మత్స్య సంపదలో 29.38 శాతం వృద్ది నమోదైంది. ఈ రెండు రంగాల వృద్ధిని కలిపేసి వ్యవసాయంలో రెండంకెల వృద్ధి రేటు నమోదైనట్లు చూపిస్తూ మోసం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004–09 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అత్యధికంగా 9.56 శాతం నమోదు చేసింది. విభజన తర్వాత ఏపీలో 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.36 శాతం ఉన్నప్పటికీ 2011–12లో అనేక విమర్శలకు గురైన జీడీపీ ఫార్ములా బేస్‌ రేటును పెంచడం వల్లే ఈ వృద్ధి కనిపిస్తోంది. పాత బేస్‌ రేటు పరిగణనలోకి తీసుకుంటే దివంగత నేత వైఎస్‌ఆర్‌ హయాంలోనే అధిక వృద్ధి రేటు నమోదైనట్లుగా గమనించవచ్చు.

పడిపోయిన పారిశ్రామిక వృద్ధి
రాష్ట్ర అభివృద్ధికి కొలమానంగా భావించే రాష్ట్ర స్థూల విలువ వృద్ధి రేటు నామమాత్రంగానే ఉంది. 2014–17 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల విలువ కేవలం ఐదు శాతం నమోదు చేయడం ద్వారా దేశంలో 16 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో జాతీయ స్థూల విలువ వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటే గుజరాత్‌లో అత్యధికంగా 11.6 శాతం నమోదైంది. రాష్ట్ర స్థూల విలువలో తయారీ రంగం వాటా 2012లో 14.5 శాతంగా ఉంటే 2017 నాటికి 10.2 శాతానికి పడిపోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో సెజ్‌లు, పారిశ్రామిక క్లస్టర్లు, కోస్టల్‌ జోన్స్‌ పేరుతో సాధించిన పారిశ్రామిక అభివృద్దిని గత ప్రభుత్వం ధ్వసం చేసింది.

భారీగా పెరిగిన ధరలు
గత ఐదేళ్ల పాలనలో పెరిగిన ధరలు సామాన్యుడిని నడ్డివిడిచాయి. 2013–17 మధ్యకాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గితే ఒక్క మన రాష్ట్రంలోనే ధరలు పెరిగాయి. వర్షాలు బాగా పడటం, అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గడంతో 2013–17 మధ్య కాలంలో జాతీయ ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. కానీ 2014–17 మధ్య కాలంలో రాష్ట్ర సగటు ద్రవ్యోల్బణం 7.6 శాతంగా నమోదైంది. ముఖ్యంగా వినియోగదారుల ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణంలో ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం గరిష్ట స్థాయిలో ఉంది.

తలసరి ఆదాయం వృద్ది అంతంతే
రాష్ట్ర తలసరి ఆదాయంలో గత ఐదేళ్లలో వృద్ది అంతంత మాత్రంగానే ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో కన్నా తలసరి ఆదాయం వృద్ధి గత ఐదేళ్లలో తక్కువగా ఉంది. 2004–09 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో 15.08 శాతం వృద్ధి నమోదు కాగా 2014–19 మధ్యకాలంలో 14.96 శాతమే నమోదైంది. ఇంతే కాకుండా గత ఐదేళ్లలో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోనే తలసరి ఆదాయం భారీగా పెరగడం మిగతా జిల్లాల్లో పెరగకపోవడంతో జిల్లాల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో తలసరి ఆదాయం కంటే కృష్ణా  జిల్లా తలసరి ఆదాయం రెట్టింపు ఉండటం దీనికి నిదర్శనం.  

మరిన్ని వార్తలు