కరోనా కట్టడికి బహుముఖ వ్యూహం

16 Mar, 2020 03:53 IST|Sakshi

అనుమానితుల గుర్తింపు, తక్షణ వైద్యం, సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి 

విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచిన ప్రభుత్వం 

రాష్ట్రంలో వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారు తక్కువే

79 మంది గుర్తింపు..పరీక్షల్లో 66 మందికి కరోనా లేదని వెల్లడి 

13 నమూనాల ఫలితాల కోసం ఎదురుచూపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది. క్షేత్రస్థాయిలో భారీగా యంత్రాంగాన్ని మోహరించింది. యంత్రాంగాన్ని అన్నివేళలా అప్రమత్తంగా ఉంచుతోంది. కరోనా అనుమానితులను గుర్తించటం.. క్షణాల్లో వారిని ఆస్పత్రులకు తరలించి పరీక్షలు చేయించటం.. తక్షణ వైద్య సేవలు కల్పించటం.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూనే ఎక్కడికక్కడ సౌకర్యాలను పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 79 కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా.. వారిలో 66 మందికి కరోనా లేదని తేలింది. మరో 13 మందికి సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టులు రావాల్సి ఉంది. ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ వ్యక్తి కోలుకుంటున్నారని.. త్వరలోనే అతణ్ణి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

విమానాల్లో వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి
- విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వివిధ దేశాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. 
ఇందుకు సంబంధించి కేంద్ర ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో అధికారులు కొందరి జాబితా పంపించగా.. అలాంటి వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఇంటింటా సర్వే జరిపించింది.
ఇప్పటివరకూ మన రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి 6,751 మంది వచ్చినట్లు గుర్తించారు. 
వీళ్లందరినీ ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. 
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైరస్‌ లక్షణాలున్న అనుమానితుల సంఖ్య మన రాష్ట్రంలో చాలా తక్కువే. 
కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌ ప్రస్తుతానికి తిరుపతిలో ఉండగా.. విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో మరో ల్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
ఇప్పటికే జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, తాజాగా జిల్లాకొక ప్రత్యేక అధికారిని నియమించారు. డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ (శ్రీకాకుళం), డాక్టర్‌ జయశ్రీ (విజయనగరం), డాక్టర్‌ గీతాప్రసాదిని (విశాఖపట్నం), డాక్టర్‌ వాణిశ్రీ (తూర్పు గోదావరి), డాక్టర్‌ శివశంకర్‌ బాబు (పశ్చిమ గోదావరి), డాక్టర్‌ సుబ్రహ్మణ్యం (కృష్ణా), డాక్టర్‌ నీరద (గుంటూరు), డాక్టర్‌ వసంత (ప్రకాశం), డాక్టర్‌ సుహాసిని (నెల్లూరు), డాక్టర్‌ రమేష్‌బాబు (చిత్తూరు), పద్మకుమారి (వైఎస్సార్‌), డాక్టర్‌ నాగేశ్వరరావు (కర్నూలు), డాక్టర్‌ మోహనకృష్ణ (అనంతపురం) ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాల్లో ఇదీ పరిస్థితి
తిరుపతి తుడా/మదనపల్లె టౌన్‌/రాజమహేంద్రవరం: చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాలకు చెందిన ఐదుగురు కరోనా అనుమానితులకు తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరికి నెగెటివ్‌ రిపోర్టు రాగా, మిగిలిన ముగ్గురి ల్యాబ్‌ రిపోర్టులు సోమవారం అందుతాయని వైద్యాధికారులు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి మలేషియా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి రక్తం, కళ్లె నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. సౌదీ నుంచి వచ్చిన మరో ముగ్గురు అనుమానితులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి ఐసోలేటెడ్‌ వార్డులో ఉంచారు. సోమవారం వీరి ల్యాబ్‌ రిపోర్టులు రానున్నాయి.

అప్రమత్తత, అనుమానితుల గుర్తింపు, తరలింపు, తక్షణ వైద్యం, సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి
క్షేత్రస్థాయిలో మోహరించిన యంత్రాంగం విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచిన ప్రభుత్వం
మన రాష్ట్రంలో వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారు తక్కువే
79 మంది అనుమానితుల గుర్తింపు

మరిన్ని వార్తలు