వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి..

12 Mar, 2020 05:59 IST|Sakshi

వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయండి 

సీబీఐకి హైకోర్టు స్పష్టీకరణ   

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాదరావు బుధవారం తీర్పు వెలువరించారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయమూర్తి అనుమతించారు. ఇవే అభ్యర్థనలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, బీజేపీ నేత సి.ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు సరైన సాక్ష్యాలను సేకరించలేకపోయారని పేర్కొన్నారు. వివేకా హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ తీర్పులను న్యాయమూర్తి ప్రస్తావించారు.

ఆ తీర్పుల ఆధారంగా వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి, తుది నివేదికను సంబంధిత కోర్టులో దాఖలు చేయాలని సీబీఐకి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐకి అప్పగించాలని ‘సిట్‌’ను న్యాయమూర్తి ఆదేశించారు. బీటెక్‌ రవి, ఆది నారాయణరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సల్మాన్‌ ఖుర్షీద్, ఆర్‌.బసంత్‌ వాదించగా.. సౌభాగ్యమ్మ, సునీత తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. 

మరిన్ని వార్తలు