కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వుల నిలుపుదల

7 Jun, 2020 07:35 IST|Sakshi

మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు

సాక్షి, అమరావతి: ప్రాథమిక విచారణ జరపకుండా కేవలం పత్రికలో వచ్చిన వార్తా కథనం ఆధారంగా ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంపై హైకోర్టు స్పందించింది. సస్పెండ్‌ చేస్తూ కర్నూలు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలుపుదల చేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్, ఎక్సైజ్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. చదవండి: ఆంధ్రజ్యోతి వాహనం సీజ్

కర్నూలు జిల్లా నంద్యాలలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనపై ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు కథనం ప్రచురించిందని, అయితే ఉన్నతాధికారులు విచారణ జరపకుండా కేవలం పత్రికా కథనం ఆధారంగా తనను సస్పెండ్‌ చేశారంటూ కె.బలరాముడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ విచారణ జరిపి.. కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 
చదవండి: ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ ఇంట్లో మద్యం పట్టివేత 

మరిన్ని వార్తలు