ట్రిపుల్‌ఐటీని నెలకోసారి సందర్శిస్తా

12 Mar, 2018 12:03 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు

మంత్రి గంటా శ్రీనివాసరావు

నూజివీడు: ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటుచేసిన ట్రిపుల్‌ఐటీల్లో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నెలకోసారి సందర్శిస్తానని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ట్రిపుల్‌ఐటీని సందర్శించిన మంత్రి  విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మెస్‌లను తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  ట్రిపుల్‌ఐటీల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని  కనీసం వెయ్యి మంది విద్యార్థులతో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు నాటికి ఎచ్చెర్ల సమీపంలోని ఎస్‌ఎం పురంలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఏటా బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు ఖర్చుచేస్తుందన్నారు.    విద్యార్థులకు నీటి సమస్యలేకుండా కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. విలేకర్ల సమావేశంలో ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు, నూజివీడు, శ్రీకాకుళం డైరెక్టర్లు  ఆచార్య వీరంకి వెంకటదాసు, హరశ్రీరాములు పాల్గొన్నారు.

నేడు నూజివీడు ట్రిపుల్‌ఐటీకి త్రిసభ్య కమిటీ
రాష్ట్రంలోని ట్రిపుల్‌ఐటీల్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఈనెల 12న నూజివీడు ట్రిపుల్‌ఐటీకి వస్తున్నట్లు ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు తెలిపారు. ఈ త్రిసభ్య కమిటీలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సీబీఎస్‌ వెంకటరమణ చైర్మన్‌గా, జేఎన్‌టీయూ కాకినాడ ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ ఎం స్వరూపారాణి, రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎంకే రహమాన్‌లను సభ్యులుగా ఉన్నారు. ఈకమిటీని గతనెల మొదట్లో ప్రభుత్వం నియమించిందన్నారు. విచారణ చేసి 15రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు