ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

13 Apr, 2017 12:02 IST|Sakshi
ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి.  విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఫస్ట్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అన్నారు. అలాగే ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్‌ విధానం అమలు చేశామని, రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ ఫలితాల్లో కూడా గ్రేడింగ్‌ విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. అలాగే 80 శాతం ఉత్తీర్ణతతో ఎప్పటిలాగే బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు 77శాతం ఉత్తీర్ణులు అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఇం‍టర్‌ ఫస్టియర్‌లో 77 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, నెల్లూరు జిల్లా (69 శాతం) ద్వితీయ, పశ్చిమ గోదావరి జిల్లా (67శాతం) తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లో 86 శాతంతో కృష్ణాజిల్లా టాప్‌లో నిలవగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సెకండ్ (80శాతం)‌, గుంటూరు జిల్లా (79శాతం) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాల్లో   వైఎస్‌ఆర్‌ కడప జిల్లా చివరస్థానంలో నిలిచింది.

గత ఏడాది ఏప్రిల్‌ 20న ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేయగా, ఈసారి అంతకన్నా వారం రోజులు ముందుగా విడుదల చేశారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షి, సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌’ www.sakshi.com, www.sakshieducation.com లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు.

ఇంటర్‌ ఫస్టియర్‌....

ఫలితాల్లో కృష్ణాజిల్లాకు (77శాతం) మొదటి స్థానం
రెండోస్థానంలో నెల్లూరు జిల్లా (69)
మూడో స్థానంలో పశ్చిమ గోదావరి (67 శాతం)
ఫస్టియర్‌ లో 64 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత

A-గ్రేడ్‌- 1,67,194 మంది విద్యార్థులు
B-గ్రేడ్‌ .... 87,346
C-గ్రేడ్‌... 41,451
D-గ్రేడ్‌... 18,480

సెకండియర్‌...
కృష్ణాజిల్లా 86 శాతంతో తొలి స్థానం
రెండో స్థానంలో నెల్లూరు, చిత్తూరు జిల్లా (80 శాతం)
మూడో స్థానంలో గుంటూరు (79 శాతం)
రెండో సంవత్సరంలో 77 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత

A-గ్రేడ్‌- 2,09,248 మంది విద్యార్థులు
B-గ్రేడ్‌ .... 82,530
C-గ్రేడ్‌... 30,400
D-గ్రేడ్‌... 8,810

ఎంపీసీలో ఫస్ట్‌ ర్యాంక్- షేక్‌ షర్మిల (992 మార్కులు)
ఎంపీసీలో సెకండ్‌ ర్యాంక్‌- దోసపాటి సాయివంశీ (992)
థర్డ్‌ ర్యాంక్‌- లోకేశ్‌ బాబు (991)

బైపీసీలో ఫస్ట్‌ ర్యాంక్‌ - ఆలపాటి నైమిషా (991)
సెకండ్‌ ర్యాంక్‌ - పసుపులేటి లీమ (990)
థర్డ్‌ ర్యాంక్‌ - ఎస్‌. హారిక (990)

సీఈసీలో ఫస్ట్‌ ర్యాంక్‌ - యుక్త (969)
సెకండ్‌ ర్యాంక్‌ - డి పల్లవి (965)
థర్డ్‌ ర్యాంక్‌ - మహేశ్వరి (965)

మరిన్ని వార్తలు