కట్‌కు కట్.. చెల్లుకు చెల్లు!

6 Sep, 2014 02:08 IST|Sakshi
కట్‌కు కట్.. చెల్లుకు చెల్లు!

పీపీఏల రద్దుతో   ఏపీకి ఒరిగిందేమీ లేదు
ఏపీ నుంచి సీలేరు విద్యుత్ బంద్
తెలంగాణ నుంచి సాగర్, జూరాల కట్

 
హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పం దాల (పీపీఏ) రద్దుతో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమీ లేదని తేలింది. పీపీఏలు, విభజన వాటాల మేరకు ప్రాంతాలవారీ కోటా విద్యుత్ సరఫరా అవుతోందని రెండు రాష్ట్రాల ఇంధన శాఖలు వేసిన లెక్కలతో తేలింది. రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగినప్పటికీ నుంచి అంటే జూన్ 2 నుంచి ఆగస్టు 4 వరకు ఏ రాష్ట్రానికి ఎంత విద్యుత్ సరఫరా అయిందనే దానిపై ఇంధనశాఖలు లెక్కలు వేశాయి. పీపీఏల రద్దుకు ముందు ఇరు ప్రాంతాలకు ఎంత వాటా ప్రకారం (తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం) విద్యుత్ సరఫరా అయిందో.. రద్దు తరువాత కూడా అదే వాటా ప్రకారం విద్యుత్ సరఫరా అయింది. వివరాలు ఇలా ఉన్నాయి...

పీపీఏల రద్దు నిర్ణయం తర్వాత సీలేరు బేసిన్ నుంచి (725 మెగావాట్లు) విద్యుత్ సరఫరాను తెలంగాణకు ఏపీ నిలిపివేసింది. తద్వారా తెలంగాణకు 316 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ నష్టం వాటిల్లింది.మరోవైపు నాగార్జునసాగర్, జూరాల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో ఏపీకి వాటా ఇవ్వకుండా  మొత్తం విద్యుత్‌ను తానే ఉపయోగించుకుంది. తద్వారా 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీకి నష్టం వాటిల్లింది.
 
విభజన సమయంలో జరిగిన పొరపాటు అంచనాలతో కేంద్ర విద్యుత్ ప్లాంట్లు (సీజీఎస్) నుంచి తెలంగాణకు 65 మెగావాట్ల విద్యుత్ అదనంగా వస్తోంది. ఈ విద్యుత్ వాస్తవానికి ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఈ విద్యుత్ ప్రస్తుతం తెలంగాణకే వస్తోంది. ఇది మరో 116 ఎంయూలని ఇంధనశాఖ లెక్కల్లో తేలింది. మొత్తమ్మీద పీపీఏల రద్దుతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒరిగిన అదనపు ప్రయోజనమేమీ లేదని విద్యుత్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా