ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు జాగీరా? : ఉదయభాను

8 Dec, 2013 01:59 IST|Sakshi

విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలని లేఖ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జాగీరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఒక ప్రకటనలో శనివారం ప్రశ్నించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. సోనియా డెరైక్షన్‌లో కిరణ్, చంద్రబాబులు కొత్త నాటకాలాడుతున్నారని ఆరోపించారు.  

గత నాలుగు నెలలుగా రాష్ట్రం రావణకాష్టంగా మారితే కనీసం స్పందించని బాబు ఇప్పుడెందుకు హడావుడిగా విలేకర్ల సమావేశాలు నిర్వహించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆర్టికల్-3 గురించి జగన్‌మోహన్‌రెడ్డి ఇతర రాష్ట్రాల నేతలను కలిసి మద్దతు కూడగడుతుంటే ఆర్టికల్-3 గురించి జగన్‌కు తెలుసా అంటూ వ్యాఖ్యానించటం ఆయనలోని దుగ్ధను  బయటపెడుతోందని పేర్కొన్నారు. ఆర్టికల్-3 గురించి పూర్తిగా తెలిసిన చంద్రబాబు ప్యాకేజీలు ఎందుకు అడిగారని  నిలదీశారు. ఈ రాష్ట్రంలో అవినీతికి ఆద్యుడు చంద్రబాబేనని, ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఏలూరు నోట్లకట్టలు కుంభకోణం, ఏలేరు స్కాం, స్టాంపుల కుంభకోణం, మద్యం కుంభకోణం... ఇలా వందల సంఖ్యలో కుంభకోణాలు బయట పడ్డాయని గుర్తు చేశారు.

సోనియాగాంధీపై నిజమైన పోరాటం చేసింది తానేని చెబుతున్న చంద్రబాబు పార్లమెంటులో ఎఫ్‌డీఐ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీలు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని, అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టినప్పుడు విప్ జారీ చేయకుండా బలం లేని కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెట్టారో కూడా బాబు బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడనట్లైతే ఆయన కోర్టు స్టే లు ఎందుకు తెచ్చుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

జగన్‌మోహనరెడ్డి అండ చూసుకుని విభజిస్తున్నారని చెప్పటానికి కిరణ్‌కుమార్ రెడ్డికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చేనాటికి కిరణ్, చంద్రబాబు కలిసి ఎమ్మెల్యేలందరితో రాజీనా మా చేయించి అసెంబ్లీ జరగకుండా అడ్డుకునే ధైర్యం వారికి ఉందా? అని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేసి ఎం పీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు