ఏపీలో కొనసాగుతున్న అధికారుల బదిలీలు

31 May, 2019 19:03 IST|Sakshi
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా లా సెక్రటరీ వెంకట రమణను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కార్యదర్శి వెంకటేశ్వరరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అశోక్‌బాబు డిప్యూటేషన్‌ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖకు ఆయనను తిరిగి పంపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు కార్యదర్శి ప్రసన్న వెంకటేష్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఇప్పటికే బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజన పధకంపై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ఈరోజు అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. (చదవండి: సీఎం కార్యాలయంలో అధికారుల బదిలీ)

మరిన్ని వార్తలు