హైకోర్టు విభజనకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఆందోళన

27 Dec, 2018 13:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఉమ్మడి హై కోర్టును విభజిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హై కోర్టులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హై కోర్టు విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రాలో హై కోర్టు ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్‌ నుంచి దింపి కోర్టు నడవకుండా చేశారు. ఆంధ్రాలో కోర్టు సముదాయాలు ఇంకా సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.

అనంతరం ఆంధ్రా న్యాయవాదులు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. తగిన సమయం ఇవ్వకుండా కోర్టును విభజించడం వల్ల కేసుల విభజన, సిబ్బంది విభజన వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. హై కోర్టు విభజనకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హై కోర్టు విభజన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాన్ని తెలంగాణకు కేటాయించగా.. ఏపీ హై కోర్టు భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని సమాచారం.

మరిన్ని వార్తలు