బదిలీలు.. ఇష్టారాజ్యం

21 Nov, 2014 04:17 IST|Sakshi

సాక్షి, కడప : చిన్నమండెం సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో లక్ష్మికాంతమ్మ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. సాధారణంగా బదిలీలు జరగాలంటే మూడేళ్లు పూర్తి కావాలి. కానీ నిబంధనలకు నీళ్లు వదిలిన అధికారులు ఈమెను బదిలీ చేశారు. ఇంకా చాలామంది విషయంలోనూ ఇలాగే జరిగింది. బదిలీల విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌లు పెట్టి చెబుతున్నా జిల్లాలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.  సాంఘిక సంక్షేమ శాఖతోపాటు వెనుకబడిన తరగతుల శాఖ హాస్టళ్ల వార్డెన్ల విషయంలోనూ అధికారులు ఎలా పడితే అలా బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

పైగా కొంతమంది వార్డెన్లు ఇప్పటికే మంత్రులు, జిల్లాకు సంబంధించిన టీడీపీ కీలక నేతల లెటర్ ప్యాడ్లను జతచేసి కావాలనుకున్న చోటికి బదిలీ చేయాలని దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. ఆయా శాఖలకు సంబంధించి ఏళ్లతరబడి సీట్లలోనే కూర్చొని ఫెవికాల్ వీరుల్లా ముద్రపడిన వారిని బదిలీ చేయకుండా.. కనీసం మూడేళ్లు కూడా పూర్తి చేసుకోని వారిని బదిలీ చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
నాయకుల విషయంలో వింత పోకడ :
కొంతమంది ఎన్‌జీవో సంఘ నాయకుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు వింత పోకడ అవలంబిస్తున్నారని పలువురు వార్డెన్లు బహిరంగంగా పేర్కొంటున్నారు. సంఘంలో సభ్యులమంటూ కొందరు, మరో క్యాడర్ అంటూ ఇంకొందరు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెస్తుండటంతో వారిని బదిలీ చేయకుండా ఆపారని పలువురు పేర్కొంటున్నారు.
 
స్పౌజ్ కేసులను ప్రత్యేకంగా పరిగణించని అధికారులు :
పులివెందుల నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ శాఖలో ఇద్దరు మహిళలు వార్డెన్లుగా పనిచేస్తున్నారు. వీరి భర్తలు కూడా టీచర్లుగా సమీప ప్రాంతాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం భార్యాభర్తలు(స్పౌజ్) విషయంలో ప్రత్యేకంగా పరిగణించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఇద్దరు మహిళా వార్డెన్లను దూర ప్రాంతానికి బదిలీ చేశారు.  
 
ఇన్‌చార్జి మంత్రి కనుసన్నల్లోనే...
జిల్లాలో బదిలీల  ప్రక్రియ అంతా ఇన్‌చార్జి మంత్రి కనుసన్నల్లోనే కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రి ఆదేశాలతోనే పలువురు వార్డెన్లను బదిలీ చేశారని.. స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తమకు అనుకూలురైన వార్డెన్లను నియమించుకోవడంలో భాగంగా ఇన్‌ఛార్జి మంత్రికి జాబితా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బదిలీలు కొనసాగుతున్నాయని వినికిడి.  
 
బదిలీలపై ఆలోచించండి.. కలెక్టర్‌ను కలిసిన  వార్డెన్లు :
బదిలీల ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ కె.వి.రమణను పలువురు వార్డెన్లు గురువారం కలిసి మాట్లాడారు. బదిలీలను కొద్దిరోజులు నిలిపివేయాలని కలెక్టర్‌ను వార్డెన్లు కోరినట్లు సమాచారం. తమ పిల్లలు ఒక ప్రాంతంలో చదువుతూ.. ఇప్పుడు మరొక ప్రాంతానికి బదిలీ అయితే సిలబస్‌తోపాటు ఇతర సమస్యలు ఎదురవుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు