‘లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ఇసుక సరఫరా చేస్తాం’

29 Oct, 2019 20:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక సరఫరా మెరుగుపరుస్తామని మైనింగ్‌శాఖ కార్యదర్శి రాంగోపాల్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని నదుల్లో వరద ప్రవాహం ఉందని తెలిపారు. ఎన్నడూ ఊహించని విధంగా వరద, వర్షాలు ముంచెత్తాయని గుర్తు చేశారు. రీచ్‌లు, ఇసుక ఉన్నా తవ్వడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ప్రతికూల వాతావరణంలోనూ రోజుకు 45 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తీస్తున్నామని తెలిపారు. వరదలు తగ్గగానే పూర్తిస్థాయిలో రీచ్‌లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘150 ఇసుక స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 267 రీచ్‌ల్లో 69 చోట్ల మాత్రమే ఇసుక తీయగలుగుతున్నాం. త్వరలో రోజుకు లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ఇసుక సరఫరా చేస్తాం. ఇసుక మైనింగ్‌లో స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఎం ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌లు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. మరో నాలుగేళ్ల వరకు ఇబ్బందులు లేని ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇసుక రవాణా వాహనాలకు కూడా జీపీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేస్తున్నాం’అని రాంగోపాల్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు