ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌.. సూపర్‌

17 Mar, 2020 12:34 IST|Sakshi

గత ఎనిమిది నెలల్లోనే 20 అవార్డులు

సాక్షి, అమరావతి: మన ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌.. సూపర్‌. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. అనేక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ పోలీసులకు లభించిన అవార్డులను గమనిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో పోలీస్‌ టెర్రరిజం అమలవుతోందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల సేవలకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపును పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు గత ఎనిమిది నెలల్లోనే ఏకంగా 20 అవార్డులు దక్కాయని గుర్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ.. స్కోచ్, జీఫైల్స్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తదితర ప్రముఖ సంస్థలు ఈ అవార్డులు అందించాయని చెబుతున్నారు. శాంతిభద్రతల నిర్వహణలో రాజీ లేకుండా విధులు నిర్వర్తిస్తున్న తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పోలీసు అధికారుల సంఘం నేతలు అంటున్నారు. (ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు)

ఏపీ పోలీసుల పనితీరుకు ఇవే కొలమానం
► 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో బెస్ట్‌ ఎలక్ట్రోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డులు అందుకున్నారు.
► జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 9 స్కోచ్‌ అవార్డులు ఏపీ పోలీస్‌ శాఖకు లభించాయి. పరిపాలన, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులకు, ఆయా శాఖలకు స్కోచ్‌ సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది.
► బాధితులకు తక్షణ న్యాయం అందించేలా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమానికి జీఫైల్స్‌ గవర్నెన్స్‌ అవార్డు లభించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ కోఆర్డినేషన్‌ పోలీస్‌ వైర్‌లెస్‌  నుంచి రాష్ట్ర పోలీసులు రెండు అవార్డులు అందుకున్నారు. నూతన సాంకేతిక పద్ధతులతో శిక్షణ, ఉత్తమ వినూత్న కార్యక్రమాల విభాగాల్లో ఈ అవార్డులు లభించాయి.
► డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి సైబర్‌ ఫోరెన్సిక్‌ శిక్షణ విభాగంలో ఏపీ పోలీస్‌ ప్రధాన కార్యాలయం అవార్డు అందుకుంది. అత్యుత్తమ సామర్థ్యం చూపుతున్నందుకు ఈ అవార్డు దక్కింది.
► ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ నిర్వహించిన టెక్నాలజీ సభ అవార్డుల్లో ఏపీ పోలీసులకు ఐదు అవార్డులు లభించాయి.

ఏపీ పోలీసులకు ప్రధాని అభినందన
రాష్ట్రంలో అమలవుతున్న పోలీస్‌ వీక్లీ ఆఫ్, స్పందన వంటి కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో ఏపీ పోలీస్‌ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ స్పందన, వీక్లీ ఆఫ్‌ గురించి తెలుసుకొని అభినందించారు.

బాబుకు పోలీసులు టెర్రరిస్టులుగా ఎందుకు కనిపిస్తున్నారు?
చంద్రబాబు పాలనలో అద్భుతంగా పనిచేశామని పొగిడిన చంద్రబాబుకు ఇప్పుడు పోలీసులు టెర్రరిస్టులుగా ఎందుకు కనిపిస్తున్నారు? అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ శాంతిభద్రతల కోసమే పోలీసులు పనిచేస్తారు. ఈ విషయం 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా?
– జనకుల శ్రీనివాసరావు, ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

మరిన్ని వార్తలు