పోలీసు స్టేషన్లపై హ్యాకర్ల పంజా

14 May, 2017 03:05 IST|Sakshi
పోలీసు స్టేషన్లపై హ్యాకర్ల పంజా

తిరుపతిలో పలు చోట్ల సమాచారం గల్లంతు
డబ్బులు డిమాండ్‌ చేస్తూ హ్యాకర్ల లాక్‌లు
చిత్తూరులో తప్పిన ముప్పు
సమాచారం పేపర్లలోనూ ఉంది: అర్బన్‌ ఎస్పీ


హ్యాకర్లు మన జిల్లానూ వదల్లేదు. 70కి పైగా దేశాల్లోని సాంకేతిక రంగ సమాచారాన్ని తస్కరించిన సైబర్‌ దుండగులు     తిరుపతి అర్బన్‌ పోలీసు వ్యవస్థను టార్గెట్‌ చేశారు.  పలు పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. వీరు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని తెలిసింది. చిత్తూరులో మాత్రం ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.

చిత్తూరు (అర్బన్‌)/తిరుపతి క్రైం : తిరుపతి అర్బన్‌ పోలీస్‌ వ్యవస్థ పరిధిలోని పలు స్టేషన్లలో శనివారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది కంప్యూటర్లు ఆన్‌ చేయగానే కొత్త పాస్‌వర్డ్‌లు అడుగుతూ స్క్రీన్‌పై సమాచారం వచ్చింది. కొన్ని చోట్ల మెయిల్‌ ఓపెన్‌ చేయగా మాల్‌వేర్‌ (వైరస్‌)ను ఎన్‌క్రిప్టెడ్‌ ఫైల్‌ ద్వారా పంపించారు. తెరిచి చూసే సరికి కంప్యూటర్లు పనిచేయలేదు. ఇలా జిల్లాలోని తిరుపతి క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్, తిరుమల, ఏర్పేడు, కలికిరి స్టేషన్లతో పాటు ఎనిమిది చోట్ల పోలీస్‌ శాఖకు సంబంధించిన డేటా హ్యాక్‌ అయ్యింది.

 పాస్‌వర్డ్‌ను డీ–కోడ్‌ చేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ సూచనలతో ఓ ప్రత్యేక బృందం ఇందుకోసం పనిచేస్తోంది. రాష్ట్ర పోలీస్‌ కమ్యూనికేషన్‌ సర్వీస్‌ (పీసీఎస్‌) కంప్యూటర్ల స్క్రీన్‌పై కనిపిస్తున్న పాస్‌వర్డ్‌లను డీ–కోడ్‌ చేసే పనిలో పడింది.  డేటా(సమాచారం) చోరీనుంచి చిత్తూరు పోలీసు జిల్లాకు కాస్త ఊరట లభించింది. శుక్రవారం రాత్రి ఎస్పీ శ్రీనివాస్‌ సెట్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో కంప్యూటర్లకు ఉన్న ఇంటర్నెట్, ల్యాన్‌ కనెక్షన్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అన్ని స్టేషన్లలో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసేయడంతో డేటా హ్యాకర్ల చేతిలో పడలేదు.

ఏమిటీ హ్యాకింగ్‌..?
ఓ వ్యవస్థకు సంబంధించిన సమాచారం, వ్యక్తిగత వివరాలు, ఇతర విషయాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వాటిని ఇంటర్నెట్‌ ద్వారా మెయిల్స్‌కు పంపడం, ఆన్‌లైన్‌ డ్రైవ్‌లో స్టోరేజీ చేసుకుంటారు. ఈ మొత్తం డేటా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడానికి కొన్ని వందల గంటల సమయం నుంచి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. డేటాను ఎవరూ చూడకుండా సీక్రెట్‌ కోడ్‌లు ఉంచడం, కంప్యూటర్లకు పాస్‌వర్డ్‌లు పెట్టడం ఆనవాయితీ. మన ప్రమేయం లేకుండా ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని తస్కరించడానికి సాంకేతిక దొంగలు ప్రయత్నిస్తుంటారు. వీళ్లనే హ్యాకర్లుగా పిలుస్తారు.

 శుక్రవారం ప్రపంచంలోని 70 దేశాలకు పైగా పలు వ్యవస్థలో ఇలా హ్యాకింగ్‌ చేసేశారు. ఇది మన దేశానికి సైతం వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోలీస్‌ శాఖలోని సమాచారాన్ని హ్యాకర్లు చేతుల్లోకి తీసుకున్నారు. డబ్బులిస్తేగానీ సమాచారం ఇవ్వబోమని.. కంప్యూటర్లకు కొత్త పాస్‌వర్డ్‌లు, సీక్రెట్‌ కోడ్‌లు ఏర్పాటుచేశారు. దీన్నే ‘వానా క్రై రాన్సమ్‌వేర్‌’ వైరస్‌గా గుర్తించారు.

తొలిసారి ఇలా ...
హ్యాకింగ్‌ జరిగిన మాట వాస్తవమే. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బం ది లేదు. అర్బన్‌ ఎస్పీ కార్యాలయంతో పాటు ఆరు స్టేషన్లలో 8 సిస్టమ్స్‌ హ్యాక్‌ అయ్యాయి.  అర్బన్‌ జిల్లా కార్యాలయంలో మూడు కంప్యూటర్లు, వెస్టు పోలీసుస్టేషన్, యూనివర్సిటీ పోలీసు స్టేషన్, తిరుపతి, తిరుమల క్రైం పోలీసు స్టేషన్, ఏర్పేడు మహిళా పోలీసు స్టేషన్లలో వీటిని గుర్తించాం. వెస్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. నాలుగైదు రోజుల్లో మాన్యువల్‌గా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తాం. హ్యాకర్లు విదేశాల నుంచి మాల్‌వేర్‌ ద్వారా సిస్టమ్‌ డేటాను ఎన్‌క్రిప్ట్‌(బ్లాక్‌చేసి) నగదు చెల్లిస్తే వాటిని విడుదల చేస్తామని మెసేజ్‌లలో తెలిపారు.

 అర్బన్‌ జిల్లాలో మొదటిసారిగా హ్యాకర్లు మాల్‌వేర్‌ లను పంపి నగదు డిమాండ్‌ చేశారు. నగరంలోని పోలీసు స్టేషన్లలో  డేటా వివరాలు పేపర్ల రూపంలో భద్ర పరిచాం. నిపుణుల ద్వారా సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  ప్రజలు కూడా గుర్తు తెలియని వ్యక్తులనుంచి వచ్చే మెయిల్స్‌ రిసీవ్‌ చేసుకోకుండా ఉండడమే మంచిది. పూర్తిస్థాయిలో హ్యాకింగ్‌ అయిన సిస్టమ్స్‌ త్వరలోనే పనిచేస్తాయి. మళ్లీ హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అయినా అప్రమత్తంగా ఉన్నాం.
– విలేకరుల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మి

మరిన్ని వార్తలు