పట్టు‘దళం’గా..

13 May, 2015 02:24 IST|Sakshi

  కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరసనలు
  ఉద్యమంలో ముందున్న మహిళా కార్మికులు
  కార్మిక శాఖ కార్యాలయాల ముట్టడి
  సంఘీభావం తెలిపిన కొత్తపల్లి సుబ్బారాయుడు
  నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపు
 
 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :వేతన సవరణ, ఫిట్‌మెంట్, ఇతర డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరింది. కార్మికులంతా పట్టుదలతో వివిధ రూపాల్లో                                  నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా కార్మికులు సైతం రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏలూ రులో నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. కార్మిక లోకానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
 
  ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా బుధవారం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద అఖిలపక్షంతో కలసి వైఎస్సార్ సీపీ శ్రేణులు ధర్నాలు నిర్వహిస్తాయని చెప్పారు. మంగళవారం ఉదయం కార్మికులు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకూ అర్ధనగ్న ప్రదర్శన జరిపి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడు శీర్షాసనం వేసి వినూత్నంగా నిరసన తెలిపాడు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు.
 
  తణుకులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు కార్మికులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. భీమవరంలో మహిళా కార్మికులు రిలే దీక్షలో పాల్గొన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి ధర్నా నిర్వహించారు. నరసాపురంలోనూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కొవ్వూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరగంట పాటు ధర్నా నిర్వహించి డిపోనుండి బస్సులను బయటకు రానీయకుండా అడ్డగించారు. వైసీపీ సమన్వయకర్త తానేటి వనిత, నాయకులు పరిమి హరిచరణ్, ముదునూరి నాగరాజు, ఎస్సీ సెల్ కార్యదర్శి ముప్పిడి విజయరావు పాల్గొన్నారు.
 
 ఉద్యమాన్ని కొనసాగిస్తాం
 భీమవరం : విధులకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించినా ఉద్యమాన్ని నిలిపివేసేది లేదని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్ రావు, ప్రాంతీయ కార్యదర్శి అల్లం సత్యనారాయణలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు