విద్యుత్ చార్జీల పెంపులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్!

6 Jul, 2013 06:09 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల చార్జీలతో ప్రజలను ఎడాపెడా బాదుతున్న రాష్ట్ర ప్రభుత్వం... విద్యుత్ చార్జీల పెంపులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 23% మేర పెంచేసి ఈ ‘ఘనత’ను సొంతం చేసుకుంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ వివిధ రాష్ట్రాలు విద్యుత్ చార్జీలను పెంచాయి. ఆయా రాష్ట్రాల్లో కేవలం 10 శాతం లోపు మాత్రమే పెంపుదల చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో కేవలం 0.77 శాతం మాత్రమే విద్యుత్ చార్జీలను పెంచారు. ఉత్తరాఖండ్‌లో 5.20%, బీహార్‌లో 6.9%, నాగాలాండ్, మేఘాలయల్లో 7% చొప్పున మాత్రమే పెరిగాయి.

కానీ మన రాష్ట్ర సర్కారు మాత్రం ఏకంగా 23% పెంపుదలతో ప్రజలపై పెనుభారం మోపింది. 200 యూనిట్లలోపు వినియోగించే గృహ వినియోగదారులను మినహాయించి అన్ని రంగాలకూ విద్యుత్ చార్జీలను పెంచింది. ఈ పెంపు ద్వారా ఏకంగా రూ. 5,500 కోట్ల అదనపు ఆదాయం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సమకూరనుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు పెంచుతూనే ఉంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలోనూ ఏకంగా 16 శాతం మేరకు పెం చింది.

మరోవైపు సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజలు కోలుకోలేని విధంగా భారీ విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. ఒకవైపు అధిక ధరకు ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలు చే స్తున్న ప్రభుత్వం... మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కో విద్యుత్ ప్లాంట్లలో తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నప్పటికీ కొనుగోలు చేయక పోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలభారం అధికంగా ఉంద ని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చార్జీల వాతతో పా టు రాష్ట్రంలో భారీ స్థాయిలో కోతలూ అమలవుతుండటం గమనార్హం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు