ఐఐటీలో చేరాలంటే ఇంటర్ మార్కులు 91.88 శాతం దాటాల్సిందే

5 Jul, 2013 05:44 IST|Sakshi
ఐఐటీలో చేరాలంటే ఇంటర్ మార్కులు 91.88 శాతం దాటాల్సిందే

ప్రతిష్టాత్మక ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలన్న మన రాష్ట్ర విద్యార్థుల ఆశలకు ‘కటాఫ్ మార్కుల’ వ్యవహారం గండికొట్టింది. ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఆయా రాష్ట్రాల ఇంటర్ బోర్డు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధన రాష్ట్ర విద్యార్థులకు అశనిపాతంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కటాఫ్ మార్కులు ఇతర రాష్ట్రాలకంటే అత్యధికంగా ఉండడంతో.. ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో మనవారు టాపర్లుగా నిలిచినా సీటు దక్కని దుస్థితి ఏర్పడింది.

సాక్షి, హైదరాబాద్: ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తీరని అన్యాయం మిగిల్చింది. మన విద్యార్థులు ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో టాప్ ర్యాంకులతో టాపర్లుగా నిలిచినా తాజా కటాఫ్ మార్కులతో సీటు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఐఐటీలో సీటు దక్కాలంటే విద్యార్థులు ఆయా రాష్ట్రాల ఇంటర్ బోర్డుల టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. ఈమేరకు ఐఐటీ-ఢిల్లీ ఆయా ఇంటర్ బోర్డుల కటాఫ్ మార్కులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కటాఫ్ మార్కులు ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉండడంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు.

ఏపీకి 91.88 శాతం.. అస్సాంకు 56.6 శాతం కటాఫ్
ఇంటర్ సెకండియర్ మొత్తం 530 మార్కులకుగాను జనరల్ కేటగిరీకి 487, ఓబీసీ కేటగిరీ అయితే 460, ఎస్సీ కేటగిరీ అయితే 432, ఎస్టీ కేటగిరీకి 437 మార్కులు కటాఫ్‌గా పేర్కొన్నారు. అంటే రాష్ట్రంలో ఇంటర్ ఎంపీసీ జనరల్ కేటగిరీ విద్యార్థులకు 91.88 శాతం మార్కులు లేదా ఆపైన వచ్చి ఉండాలి. ఓబీసీ కేటగిరీ విద్యార్థులైతే 86.79 శాతం, ఎస్సీ అయితే 81.50 శాతం, ఎస్టీ అయితే 82.45 శాతం మార్కులు సాధించాలి. అయితే ఇదంతా మన రాష్ట్ర విద్యార్థుల మధ్యే పోటీ కదా అనుకుంటే పొరపాటు పడినట్లే.

2600 ర్యాంకు వచ్చిన రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థినికి ఖరగ్‌పూర్ ఐఐటీలో తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు దక్కింది. అయితే ఆ విద్యార్థినికి టాప్-20 పర్సంటైల్ మార్కులు లేవు. దీనివల్ల ఆ విద్యార్థిని సీటు కోల్పోనుంది. ఆ సీటు తిరిగి మన రాష్ట్రానికి దక్కదు. వేరే రాష్ట్రాల విద్యార్థులకు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన ఏ రాష్ట్రాల కటాఫ్ మార్కులు ఇంత అత్యధిక ంగా లేవు. ఈ నేపథ్యంలో ఐఐటీలో మంచి ర్యాంకు వచ్చినా ఇంటర్మీడియట్‌లో అగ్రశ్రేణి మార్కులు రాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీటు దక్కదని స్పష్టమవుతోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికైతే కేవలం 56.6 శాతం మాత్రమే కటాఫ్ కావటం గమనార్హం. అలాగే త్రిపుర 53.6 శాతం మాత్రమే ఉంది.

పేద విద్యార్థులకు పెను భారమే
కటాఫ్ పర్సంటేజీలు ఇలా...ఐఐటీ ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకునే కాకుండా విద్యార్థి తరగతి గదిలో పాఠ్యాంశాలను కూడా నేర్చుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఈ విధానం ప్రవేశపెట్టినప్పటికీ.. అన్ని రాష్ట్రాల ఇంటర్ మార్కులు ఒకే రీతిలో ఉండకపోవడం వల్ల మనకు అన్యాయం జరుగుతోంది. ర్యాంకుల వేటలో విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదని, ఇంటర్‌లో మంచి మార్కులు వస్తే విద్యార్థికి సమగ్ర వికాసం ఉంటుందని ఈ విధానం తెచ్చారు.

కానీ ఇది మన విద్యార్థుల పాలిట శాపమైంది. రాష్ట్రానికి చెందిన నిరుపేద విద్యార్థులు ఇక ఐఐటీ సీటు సాధించాలంటే అటు కోచింగ్‌కు, ఇటు ఇంటర్‌లో టాప్ మార్కుల కోసం అగ్రశ్రేణి కళాశాలల్లో చేరి చదువుకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ‘ఈ విధానం పూర్తిగా అన్యాయమని గతేడాది సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడే మేం ఆందోళన చేపట్టాం. మానవ వనరులశాఖ మా వాదనను పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన రీతిలో స్పందించలేదు..’ అని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’తో తమ ఆవేదన పంచుకున్నారు.

‘అ’సాధారణ ప్రక్రియ!
జేఈఈ-మెయిన్స్‌లో రాష్ట్రానికి అగ్రశ్రేణి మార్కులు దక్కినా ఇంటర్ వెయిటేజీలో బోర్డు మార్కులకు సాధారణీకరణ సూత్రం వర్తింపజేసి ర్యాంకులు కేటాయించడంతో మనకు అగ్రశ్రేణి ర్యాంకులు దక్కలేదు. సాధారణీకరణ ప్రక్రియ కూడా ఇతర రాష్ట్రాలకే మేలు చేసేలా ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ఇంటర్ బోర్డు ఇదివరకే టాప్-20 పర్సంటైల్ లెక్కలు ప్రకటించింది. కానీ దానికి భిన్నంగా ఐఐటీ-ఢిల్లీ కటాఫ్ మార్కులను విడుదల చేసింది. తొలి విడత ఐఐటీ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఇప్పుడు తాజాగా ప్రకటించిన కటాఫ్ మార్కులు చూసి ఖంగుతిన్నారు. టాప్-20 పర్సంటైల్‌లో లేకపోవడంతో ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వెళ్లాలా? వద్దా? అన్న మీమాంసలో పడ్డారు. వెరిఫికేషన్‌కు వెళ్లాలంటే ముందు రూ. 60 వేల ఫీజు డీడీ రూపంలో చెల్లించాలని, మద్రాస్-ఐఐటీకి వెళ్లాల్సి ఉంటుందని వాపోతున్నారు.

మరిన్ని వార్తలు