అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

14 Dec, 2019 04:16 IST|Sakshi

న్యూజెర్సీలోని హోటల్‌లో నిద్రమాత్రలు మింగి బలవన్మరణం

కుటుంబంలో విభేదాలే కారణం?

కురబలకోట(చిత్తూరు జిల్లా): అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన గుమ్మడికాయల ద్వారకానాథరెడ్డి(38) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం శుక్రవారం కుటుంబ సభ్యులకు అందింది. కుటుంబంలో మనస్పర్థల వల్లే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లెకు చెందిన ద్వారకానాథరెడ్డికి చిన్నతనంలోనే తండ్రి జయచంద్రారెడ్డి చనిపోయారు. తల్లి రమణమ్మ కష్టపడి చదివించింది. బీఎస్సీ కంప్యూటర్స్‌ చేసిన ద్వారకానాథరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు అభ్యసించాడు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తుండగా,  గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కల్యాణితో పరిచయమైంది. అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి ధృవన్, యువన్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం ద్వారకనాథరెడ్డికి అమెరికాలోని అమెజాన్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. అతడి భార్య కల్యాణి కూడా అక్కడే మరో కంపెనీలో పనిచేస్తున్నారు. న్యూజెర్సీ ప్రాంతంలో కాపురం ఉంటున్నారు.

సజావుగా సాగుతున్న వీరి కాపురంలో కొన్నాళ్లుగా కలతలు రేగినట్లు వారి బంధువుల ద్వారా తెలిసింది. భర్త నుండి విడిపోడానికి కల్యాణి విడాకులు కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు మనస్తాపానికి గురై, న్యూజెర్సీలోని ఓ హోటల్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది.   కాగా, గుమ్మడికాయల ద్వారకానాథరెడ్డి మృతదేహాన్ని అమెరికా నుంచి రప్పించడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు