రాష్ట్రమంతా ‘వికేంద్రీకరణ’ కోరుకుంటోంది

11 Feb, 2020 16:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రమంతా సమర్థిస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంశంపై ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్‌ బాషా, మైనార్టీ శాసనసభ్యులు, 13 జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. 

సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంపై సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించడం జరిగిందన్నారు. అనేక దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, నాయకులు కూడా సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పారు. ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో వికేంద్రీకరణ నిర్ణయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించడం జరిగిందన్నారు. 

(ఏపీలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు.. )

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీల పక్షపాతిగా ఉంది. ఇప్పటికీ, ఎప్పటికీ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ బిల్లుల విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల ప్రజలు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరుల్లో అభద్రతా భావం ఏర్పడిందని, వీటిపై కూడా సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లో ఉండే మైనార్టీలు అక్కడ ఇమడలేకపోతున్నారో.. వారికి రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం ఇస్తామని వారు చెప్పిన తీరును బట్టి వైఎస్సార్‌ సీపీ ఆ రోజున మద్దతు ఇచ్చిందని, ఇవాళ కేంద్రం వైఖరి వేరే విధంగా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర బిల్లులను పూర్తిగా వ్యతిరేకించారన్నారు.

('తాను, కొడుకు బాగుంటే చాలు.. ఇంకేం అవసరం లేదు')

ప్రజలకు అన్యాయం చేసే ప్రతీ చట్టాన్ని వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఎన్‌ఆర్‌సీ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని సీఎం వైఎస్‌ జగన్‌ కడప బహిరంగ సభలో చెప్పారని గుర్తు చేశారు. అదే విధంగా ఎన్‌పీఆర్‌ను కూడా వ్యతిరేకిస్తున్నామని, 2010, 2015 సంవత్సరాల్లో ఎన్‌పీఆర్‌ చేశారని, కానీ.. వాటికి భిన్నంగా 2020లో చేస్తోందని.. 13ఏ, 13బీ రెండు కాలమ్స్‌ ఎక్స్‌ట్రాగా యాడ్‌ చేశారని, కేంద్రం ప్రస్తుతం తెచ్చిన ఫార్మట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మైనార్టీ నాయకుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఎవరికీ హాని జరగకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు.

>
మరిన్ని వార్తలు