ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాజధానిగా ఏపీ!

24 Sep, 2019 09:06 IST|Sakshi

ఈవీ వాహన తయారీ కేంద్రంగా రాష్ట్రం

త్వరలో నూతన పాలసీ విడుదల చేస్తాం

‘సాక్షి’తో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఆటోమొబైల్‌ రాజధాని అయిన అమెరికాలోని డెట్రాయిట్‌ తరహాలో దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల (ఈవీ) రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తుండటమే కాకుండా ఈవీ తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కొత్త ఈవీ పాలసీని రూపొందించే పనిలో పరిశ్రమల శాఖ ఉంది. ఇప్పటికే తమిళనాడు.. కంపెనీలకు భారీ రాయితీలను ప్రకటిస్తూ నూతన పాలసీని విడుదల చేయడంతో రాష్ట్రం మరింత ఆకర్షణీయ పాలసీని రూపొందించాలని నిర్ణయించింది.

కేవలం రాయితీలే కాకుండా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, మౌలిక వసతులు కల్పించే విధంగా ఈవీ పాలసీని తయారుచేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈవీ వాహన కంపెనీలతో సంప్రదింపులు జరిపామని, పాలసీలో ప్రతిపాదించాల్సిన అంశాలపై పరిశోధన సంస్థల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే పాలసీని విడుదల చేస్తామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్టీసీలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారని, దీంతో ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.

ప్రత్యేక పవర్‌గ్రిడ్‌లు, చార్జింగ్‌ పాయింట్లు
ఈవీ వాహనాలకు నిరంతర విద్యుత్‌ అవసరమని దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పవర్‌గ్రిడ్‌లతోపాటు చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు. అదేవిధంగా పవన, సౌర విద్యుత్‌ వంటివి అధికంగా ఉత్పత్తి అయితే ఆ విద్యుత్‌ను నిల్వ ఉంచడానికి స్టోరేజ్‌ బ్యాటరీలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. దీనికోసం విశాఖ–విజయవాడల్లో పవర్‌గ్రిడ్, చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే విధంగా పైలట్‌ ప్రాజెక్టు కింద పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి జపాన్‌కు చెందిన ఒక బ్యాంక్‌ ఆసక్తిని చూపిస్తోందని, త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు. కంపెనీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీతోపాటు, దాని అనుకూల పత్రికలు చేసినదంతా తప్పుడు ప్రచారమని కంపెనీలు అర్థం చేసుకున్నాయన్నారు. ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ల వల్ల సంస్థలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో సీఎం ఇన్వెస్టర్ల ఔట్‌రీచ్‌ కార్యక్రమంలో వివరించి చెప్పడం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇటీవల విశాఖలో జరిగిన రెండో ఔట్‌రీచ్‌ కార్యక్రమం విజయవంతం కావడమే దీనికి నిదర్శనమన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా