ఆ ఆస్తుల్లో ఆంధ్రాకూ వాటా

30 Nov, 2014 01:52 IST|Sakshi
ఆ ఆస్తుల్లో ఆంధ్రాకూ వాటా

* పలు సంస్థల ఆస్తులపై కేంద్ర హోంశాఖకు ఏపీ సీఎస్ లేఖ
* పదో షెడ్యూల్ సంస్థలతో పాటు ఏ షెడ్యూల్లో లేని సంస్థల్లోనూ ఏపీకి వాటా ఇవ్వాలి
* లేదంటే కొత్త రాజధానిలో ఆ సంస్థల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలి
* అప్పటివరకు ఆ సంస్థల సేవలు ఏపీకి అందించాలి.. ఆ తర్వాత వదిలేస్తాం
* తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్లు ఇతర రాష్ట్రాల విభజన అంశాలు ఏపీకి వర్తించవు
* ఆ రాష్ట్రాల్లో ఉమ్మడి రాజధాని లేదు.. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ అధికారాల నిబంధనలు రూపొందించాలి.

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్లో పొందుపరచిన సంస్థల ఆస్తుల్లో సెక్షన్ 64 ప్రకారం.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి నివేదించారు. పదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున ఆ సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని, కేవలం సెక్షన్ 75 ప్రకారం ఆ సంస్థల సేవలను మాత్రమే ఏడాది పాటు అందిస్తామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వ వాదన సరికాదని ఆయన వివరించారు.
 
 సెక్షన్ 75 కేవలం ఆయా సంస్థల సేవలు అందించే విషయాన్ని పేర్కొందని, రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఆరో విభాగంలో సెక్షన్ 64 మాత్రం పదో షెడ్యూల్‌లోని సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని, రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు ఆస్తులను పంపిణీ చేసుకోవాలని, ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోలేకపోతే కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేయాలని పేర్కొందని సీఎస్ వివరించారు. అంతేకాకుండా గతంలో రాష్ట్రాల విభజన సమయంలో పలు ప్రక్రియలు ఇక్కడ వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన కూడా సరికాదని ఆయన స్పష్టంచేశారు. గతంలో విడిపోయిన రాష్ట్రాలకు ప్రస్తుతం ఏపీకి ఉన్న తరహాలో ఉమ్మడి రాజధాని లేదని గుర్తుచేశారు.
 
 వాటా లేదంటే కొత్త రాజధానిలో కేంద్రమే ఏర్పాటు చేయాలి...
 తెలంగాణ వాదన ప్రకారం పదో షెడ్యూల్‌లోని సంస్థల్లోను.. అలాగే ఏ షెడ్యూల్‌లో లేని సంస్థల్లోను ఎటువంటి వాటా కోరకూడదంటే.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఆయా సంస్థల నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని.. నూతన రాజధానిలో ఆ సంస్థలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి వచ్చే వరకు.. తెలంగాణలోని ఆయా సంస్థల సేవలను ఆంధ్రాకు కొనసాగింపచేయాలని కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. అప్పుడు పదో షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తుల్లో వాటా అడగకుండా వదిలేసి వెళ్లిపోతామని స్పష్టంచేశారు. లేదంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఆయా సంస్థల ఆస్తులు పంపిణీని కేంద్ర ప్రభుత్వమే చేయాలని, ఇందుకు అవసరమైన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు.
 
 ఇతర  అంశాలపైనా స్పష్టత ఇవ్వాలి...
 ‘‘రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 53 (1) (బి) ప్రకారం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రధాన కార్యాలయాలను ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేయాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యాలయాలు మాత్రమే అని భావిస్తోంది. భవనాలతో పాటు ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి’’ అని ఐవైఆర్ కోరారు.  
 
 హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలను అమలు చేయండి..

 ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర ప్రాంత వాసుల ప్రయోజనాలను పరిరక్షించడం, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగిస్తూ చట్టంలోని 8వ సెక్షన్‌లో పేర్కొన్నారని, ఇందుకు సంబంధించిన నిబంధనలను ఇప్పటి వరకు రూపొందించలేదని ఏపీ సీఎస్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను నియమించినా, వారికి ఇప్పటి వరకు ఎటువంటి పనిలేదని, చట్టంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ నిర్వహించలేకపోతున్నారని సీఎస్ వివరించారు. దీని నిబంధనలను త్వరగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అలాగే కార్మిక సంక్షేమ నిధి బదిలీతో పాటు తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎవరిది తప్పో తేల్చడానికి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కూడా ఐవైఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు