మెతుకు లేక.. బతుకు వలస

19 Aug, 2018 13:05 IST|Sakshi
సౌదీలో రోడ్లపై నిద్రహారాలు లేకుండా ఉన్న గల్ఫ్‌ బాధితులు(ఫైల్‌ఫొటో)

ఉన్న ప్రాంతంలో మెతుకు పుట్టదు.. ఎంత పనిచేసినా బతుకు మారదు. పేరుకు ఉద్యానవనం. కానీ పచ్చదనం కోల్పోయి చాలాకాలమవుతోంది. ఉద్దానం బిడ్డలు ఇప్పుడు బతుకు వెతుక్కుంటూ వేరే దేశాలకు వెళ్తున్నారు. కేవలం కూలి పనుల కోసం కుటుంబాలను వదిలి సరిహద్దులు దాటుతున్నారు. అంతదూరం వెళ్తున్నా వారి జీవితాలు మారడం లేదు. బ్రోకర్ల చేతిలో మోసపోవడం.. ప్రమాదాల్లో చిక్కుకోవడం వంటి సంఘటనలు వారి కుటుంబ సభ్యులను కలవర పెడుతున్నాయి. టెక్కలి డివిజన్‌ పరిధిలో ఉద్దానం ప్రాంతంగా పిలిచే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. దీంతో చదువుకొని.. నిరుద్యోగులుగా ఉన్న యువకులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి కోసం వలస వెళుతూ , అక్కడ భద్రత లేని ఉద్యోగాల్లో చేరి అవస్థలు పాలవుతున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అయినా సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

శ్రీకాకుళం  / కంచిలి: ఉద్దానం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో చాలామంది నిరుద్యోగులు, యువకులు దూర ప్రాంతాలకు సైతం వెళ్లేందుకు వెనుకాడడం లేదు. ఈ అవకాశాన్నే కొంతమంది బ్రోకర్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. గ్రామాల్లో తిరుగుతూ యువకుల్ని ఆకర్షిస్తూ గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశలు చూపి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత ఏదో విధంగా బయట దేశానికి వెళ్లి.. నాలుగు రూపాయలు సంపాదించాలని ఆశిస్తున్నారు. అయితే అలాంటి ప్రయాణాలు సక్రమంగా సాగడం లేదు. ఇక్కడి నుంచి పంపే బ్రోకర్లు సరైన పద్ధతిలో పంపించకపోవడం, టూరిస్టు వీసాలతో అక్కడికి పంపిన తర్వాత పట్టించుకోకపోవడంతో దేశంకాని దేశంలో ఉద్దానం వాసులు అవస్థలు పడిన సందర్భాలు కోకొల్లలుగా ఇటీవల వెలుగు చూశాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే ఉద్దానం యువతకు ఈ దుస్థితి ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ ఏడాదిలో జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. 
టెక్కలి డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన యువకులు సౌదీ అరేబియాలో ఇటీవల చిక్కుకున్నారు. అక్కడి నుంచి బాధితులు నేరుగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. అక్కడ వారు పడుతున్న అగచాట్లకు సంబంధించిన ఫొటోలు పంపించారు. ఒడిశా రాష్ట్రం గంజాం, జయంతిపురం గ్రామాల పరిధిలో గల యువకులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పది మంది బాధితులు గల్ఫ్‌లో చిక్కుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఒడిశాలోని బరంపురం, ఇచ్ఛాపురం, టెక్కలిలో గల ఏజెంట్ల ద్వారా పొట్టకూటి కోసం గల్ఫ్‌ వెళ్లారు. అప్పట్లో చిక్కుకున్న వారిలో శ్రీకాకుళానికి చెందిన కిలుగు రామారావు రెడ్డి (ఇచ్ఛాపురం మున్సిపాలిటీ బెల్లుపడ కాలనీ), దుంప బైరాగి (ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి), దూపాన ప్రకాష్‌ రెడ్డి (కంచిలి మండలం అంపురం), కల్లేపల్లి కార్తీక్‌ (సోంపేట మండలం తాళపధ్ర), రాజాం రామారావు (పూండి, తోటపల్లి), గొరకల హేమారావు( పూండి ముల్లారిపురం), బయా పెంటయ్య (బావనపాడు)తో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మద్ది బృహస్పతి(ఒడిశా గుడ్డిపద్ర), కోళ హరికృష్ణ (ఒడిశా బొరివాడ), గణేష్‌ పాత్రో జంకల, శిలవలస గోపాల్, పూదరి శ్రీనివాస్, నీలమ్‌ రాజకుమార్, గలిపెల్లి మధు, సౌదా బత్తుల  ఉమామహేశ్వరావు, ఉమాశంకర్‌ సాహూ,  సిలవలస వాసుదేవ్, సుధామ చంద్ర సాహూ, పెదిని తారేసు, పందిరి విజయ్‌కుమార్, లోచన బెహరా, ముడిలి ప్రహ్లాద్, సిలివలస గోపాల్, దకుయా గోవింద్‌లు ఇబ్బందులు పడ్డారు.  

ఏజెంట్ల మాయలో...
విదేశా>ల్లో ఉద్యోగం...చేతి నిండా సొమ్ము...ఐదేళ్లు పాటు విదేశాల్లో ఉంటే కోటీశ్వరులవుతారంటూ నిరుద్యోగ యువకులకు గాలం వేసే ఏజెంట్లు జిల్లాలో కోకొల్లాలు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నుంచి బరంపురం వెళ్లే రహదారుల్లో పుట్టగొడుగుల్లా ఇనిస్టిట్యూట్‌లు వెలిశాయి. కేవలం నిరుద్యోగులకు వల విసిరి వారి వద్ద భారీగా నగదు దోచుకోవడం అలవాటు పడ్డారు. ఇచ్ఛాపురం పురపట్టణంలోనే ఐదు, కంచిలి మండలంలో రెండు ఇనిస్టిట్యూట్‌లున్నాయి. సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో పలు గ్రామాల్లో బ్రోకర్లు కూడా ఉండి నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు.  

నామమాత్రం శిక్షణతో..
బ్రోకర్లు ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్‌లో వెల్డింగ్, ఫిట్టర్‌ వంటి శిక్షణలు తూతూ మంత్రంగా ఇస్తూ విదేశాలకు పంపించాలంటే సుమారు 80 వేల  నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్నకు చెందిన అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ ప్రతినిధి ఉద్యోగాలిప్పిస్తానంటూ ఎంతో మంది అమాయక యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి ఉద్యోగాలిప్పించకపోవడంతో వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇటీవల పలాస పట్టణానికి చెందిన ఒక బ్రోకర్‌  30 మంది నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసిన  వైనం బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక  మందస మండలంలో కూడా ఇటువంటి సమస్య బయటపడింది. ఇలా ఉద్దానం ప్రాంతంలో చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్ల అవతారమెత్తి నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు.

 అయినా నిరుద్యోగులు కూడా ఇవేమీ పట్టించుకోకుండా వేలాది రూపాయలు చెల్లించి విదేశీ ఉద్యోగాలపై ఆశతో బ్రోకర్ల చేతిలో డబ్బులు పెడుతూ మోసం పోవడం.. లేదా విదేశాలు వెళ్లి అక్కడ అవస్థలు పడడం జరుగుతున్నాయి. ఉద్దానం ప్రాంతం నుంచి ఏడాదికి సగటున 2వేల మంది వరకు యువకులు విదేశాలకు వలస వెళుతున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులు చేసి పొట్టనింపుకోవడానికి మన దేశంలోని తమళనాడు, బెంగళూరు, గుజరాత్, ముంబాయి తదితర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు కూడా ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది ఉన్నారు. 

నిర్మాణ రంగంలో ఉన్న వారు పనులు చేసే క్రమంలో  ప్రమాదాలబారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలంటూ తీసుకెళ్లే బ్రోకర్లు, వివిధ కంపెనీలు ఇక్కడ చెప్పేదొక ఉద్యోగం అయితే .. అక్కడ బాత్రూంలు, లెట్రిన్‌లు శుభ్రపరిచే పనులను కూడా అప్పగించే సందర్భాలు ఉనాయి. ఆ పనిలో కూడా భద్రత లేకపోవడంతో తమ దుస్థితిని తెలియజేస్తూ అక్కడ ఇబ్బందులు పడేవాళ్లు మనసు చంపుకొని ఆ ఫొటోలను ఇక్కడికి పంపి, కాపాడమని వేడుకున్న సందర్భాలు కూడా ఇటీవల వెలుగు చూశాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు గానీ.. సర్కార్‌ గాని పట్టించుకోకపోవడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 ప్రత్యేకహోదాతోనే పారిశ్రామికాభివృద్ధి 
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ వలసల రాష్ట్రం. అందులో శ్రీకాకుళం జిల్లా వలసల్లో ప్రథమస్థానంలో ఉంది.  ఉద్దానం పరిస్థితి అయితే మరింత ఘోరం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే పారిశ్రామిక ప్రగతి జరిగి, ఉన్న ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు జరిగి యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆయన వస్తే పరిశ్రమలు వస్తాయని ఆశించిన యువత తీవ్రమైన మోసానికి గురైంది. నిరుద్యోగులు దగాపడ్డారు. 
 –డాక్టర్‌. సీదిరి అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త

వెనుకబాటు తనంతోనే వలసలు 
ఉద్దానం ప్రాంతంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక వెనుకబాటులో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, పంటలు కూడా పూర్తిస్థాయిలో పండకపోవడంతో ఇక్కడి యువకులుతోపాటు అన్ని వయస్సుల వారు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఉద్యోగాలు కల్పిస్తారని ఆశించిన యువతకు నిరాశే మిగిలింది.     
– పిరియా సాయిరాజ్, వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త

వలస బతుకులు దుర్భరం 
స్థానికంగా ఉద్యోగావకాశాలు లేక కుటుంబాలను ఇక్కడ విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నార. తీరా అక్కడ పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయి. నేను కూడా కుటుంబాలను పోషించాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే తలంపుతో ఇతర ప్రాంతానికి వెళ్లాను. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి వచ్చేసి, ఇక్కడ ఆటో  నడుపుకొని జీవిస్తున్నాను.
 –నారద భీమారెడ్డి, నరసన్నముకుందాపురం గ్రామం, కంచిలి మండలం

ఉద్యోగాల్లేక అల్లాడుతున్నాం 
రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగాల కల్పన చేపట్టకపోవడంతో డిగ్రీలు, పీజీలు చేసి అల్లాడుతున్నాం. మా లాంటి ఎంతో మంది యువకులు చదువుకున్నవారు సైతం స్థానికంగా ఉద్యోగాలు లేకపోవడంతో అప్పులు చేసి మరీ విదేశాలకు వెళుతున్నాం. అక్కడ ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
 –తరిపిల మురళి, పోస్టు గ్రాడ్యుయేట్, గోకర్ణపురం, కంచిలి మండలం 

మరిన్ని వార్తలు