భూకుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించండి

21 Jan, 2020 05:28 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు స్పీకర్‌ తమ్మినేని సూచన 

తప్పకుండా జరిపిస్తామన్న ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సీఎం వైఎస్‌ జగన్‌కి సూచించారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సోమవారం మాట్లాడుతూ.. 2014లో రాజధాని ప్రాంత ప్రకటనకు ముందు అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల వివరాలు వెల్లడించారు. చంద్రబాబు, ఆయన బినామీలు.. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి సాగించిన అవినీతిని ఆధారాలతో సహా వివరించారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. ప్రభుత్వం శాసనసభలో చేసిన ప్రకటనను ఓ పబ్లిక్‌ డాక్యుమెంట్‌గా పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అసలు ఏం జరిగిందో సవివరంగా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అందువల్ల అమరావతి ప్రాంతంలో జరిగిన భూ లావాదేవీలు, కుంభకోణాలపై సమగ్రంగా విచారించి వాస్తవాలను వెలికితీసి ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను స్పీకర్‌ సీతారాం సూచించారు.  

శాసనసభకు ఆ అధికారం ఉంది: ముఖ్యమంత్రి జగన్‌ 
స్పీకర్‌ ఆదేశాల మేరకు అమరావతి భూముల వ్యవహారాలపై తప్పకుండా విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. స్పీకర్‌ సూచనపై ఆయన స్పందిస్తూ ‘మీ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం. దేనిమీద అయినా విచారణ జరిపించమని ఆదేశించే అధికారం శాసనసభకు ఉంది. స్పీకర్‌ అంటే క్వాసీ జ్యూడీషియల్‌ అథారిటీ. మీకు జడ్జి హోదా ఉంది. మీ ఆదేశాల మేరకు తప్పకుండా విచారణ జరిపిస్తాం’అని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు