విద్యుత్ మంటలు

20 Jun, 2014 01:26 IST|Sakshi
విద్యుత్ మంటలు

ముదురుతున్న పీపీఏల రద్దు వివాదం
ఎక్కడి విద్యుత్ అక్కడే అంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు
వాటాలు చెల్లవని ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి చెప్పిన ఏపీఎస్‌ఎల్‌డీసీ
ఏపీజెన్‌కో నిర్ణయానికి ఈఆర్‌సీ తిరస్కృతి
డిస్కంలూ ప్రతిపాదిస్తే పరిశీలిస్తామని స్పష్టీకరణ
ఈఆర్‌సీ ఆమోదం అక్కర్లేదంటున్న ఏపీ వర్గాలు
ముందస్తుగా హైకోర్టులో ఏపీజెన్‌కో కేవియట్ దాఖలు
రద్దు నిర్ణయంపై వెంటనే స్టే రాకుండా వ్యూహం
23న హైకోర్టుకు వెళ్లే యోచనలో టీ విద్యుత్ సంస్థలు
ఈ విషయంలో జోక్యం చేసుకుంటామన్న కేంద్రం
 
 సాక్షి, హైదరాబాద్:
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అగ్గిరాజుకుంటోంది. తాజాగా చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు చివరకు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. ప్రస్తుతమున్న కోటా మేరకే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాలన్న దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) గురువారం తెగేసి చెప్పింది. తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీజెన్‌కో పంపిన పీపీఏల రద్దు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తిరస్కరించింది. జెన్‌కోతో పాటు నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కూడా పీపీఏలు కుదుర్చుకున్నందున ఇరు పక్షాలూ రద్దు ప్రతిపాదనలు ఇవ్వాలని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీజెన్‌కో చీఫ్ ఇంజనీర్‌కు గురువారం లేఖ రాసింది. అయితే, పీపీఏల రద్దుపై  ఈఆర్‌సీ నిర్ణయం ప్రభావం చూపదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీపీఏలకు ఈఆర్‌సీ అధికారికంగా అనుమతి ఇవ్వనందున వాటి రద్దు విషయంలో ఆ సంస్థ ఆమోదం అవసరం లేదని ఏపీ ఇంధన శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఏపీజెన్‌కో నిర్ణయం తమకు సమ్మతం కాదని, దీన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణకు చెందిన డిస్కంలు ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్(గతంలో సీపీడీసీఎల్)లు తాజాగా లేఖ రాశాయి. అయితే ఆ నిర్ణయంలో మార్పు లేదని బదులిస్తూ ఏపీజెన్‌కో కూడా లేఖ రాయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లు మాత్రం పీపీఏల రద్దుకు అంగీకరించాయి. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యుత్ శాఖ వర్గాలు అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వానికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద తమ ప్లాంట్ల విద్యుత్‌ని తామే వినియోగించుకుంటామన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లవారీగా జరిగే విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని (షెడ్యూల్‌ని) ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి పంపడం లేదు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే ఏపీజెన్‌కో హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడం గమనార్హం. పీపీఏల రద్దుపై కోర్టు వెంటనే స్టే ఇవ్వకుండా ఏపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మరోవైపు సోమవారం హైకోర్టులో పిటిషన్ వేసేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధమవుతున్నాయి.
 
 ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ ఆదేశాలు పాటించం: ఏపీఎస్‌ఎల్‌డీసీ లేఖ
 పీపీఏలతో సంబంధం లేకుండా రాష్ట్రాల కోటా మేరకు విద్యుత్ సరఫరా చేస్తామన్న ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి  గురువారం ఏపీఎస్‌ఎల్‌డీసీ ఘాటుగా లేఖ రాసింది. రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న మేరకు మొత్తం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం చొప్పున విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అసలు పీపీఏలు ప్రస్తుతం అమలులోనే లేనందున తమ రాష్ర్టంలోని విద్యుత్‌ని తామే వాడుకుంటామని, ఈ విషయంలో ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ ఆదేశాలను కూడా పాటించాల్సిన అవసరం లేదని ఏపీఎస్‌ఎల్‌డీసీ తన లేఖలో తేల్చి చెప్పింది. ‘అమల్లో ఉన్న పీపీఏలు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో స్పష్టం చేశారు. అదేవిధంగా ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడేనని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం పీపీఏల కాలపరిమితి తీరిపోయి అవి అమల్లో లేని విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్లాంట్ల విద్యుత్‌ను మేమే వినియోగించుకుంటాం. ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ ఆదేశాల ప్రకారం మేం నడుచుకోవాల్సిన అవసరం లే దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలనే  పాటిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని డిస్కంలకు మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని రాష్ర్ట ప్రభుత్వం మాకు ఈ నెల 17న ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 37 ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనే ఆ రాష్ర్ట లోడ్ డిస్పాచ్ సెంటర్లు విధిగా పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ, ఉత్పత్తి సవ్యంగా సాగడానికి ఇది తప్పనిసరి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మేం నడుచుకుంటాం. ఇక్కడి విద్యుత్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ని వంద శాతం ఇక్కడే ఇవ్వడం మా విధి. మేం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌కు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తాం. ఇరు రాష్ట్రాలకు విద్యుత్ కోటా నిర్ణయించేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతినిధి లేని విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. అందువల్ల ఈ కోటా నిర్ణయం అమలు సమంజసం కాదు’ అని ఏపీఎస్‌ఎల్‌డీసీ తన లేఖలో స్పష్టం చేసింది. అదేవిధంగా జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ఎస్‌ఎల్‌డీసీలు ఏర్పడిన విషయాన్నీ గుర్తుచేసింది. తమ నిర్ణయాన్ని గౌరవించి రాష్ర్టంలో విద్యుత్ సరఫరాకు, గ్రిడ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు విన్నవించింది.
 
 విద్యుత్ ఉత్పత్తి షెడ్యూల్‌కు మంగళం
 ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి చెప్పాల్సిన ఆయా కేంద్రాల ఇంజనీర్లు ఈ ప్రక్రియకు తాజాగా మంగళం పాడారు. ‘తమ రాష్ట్రానికి చెందిన ప్లాంట్ల నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్న సమాచారాన్ని కేవలం ఏపీఎస్‌ఎల్‌డీసీకి మాత్రమే ఇస్తాం. తమవి అంతర్రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లు కానందున వాటి ఉత్పత్తి షెడ్యూల్‌ను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్లాంట్ల చీఫ్ ఇంజనీర్లు(సీఈ)లు గురువారం స్పష్టం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే సమాచారం ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి చేరడం లేదు. ఫలితంగా కోటా ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా విషయంలో అస్పష్టత రావడం లేదు. మొత్తానికి గురువారం నాడు ఏపీలో ఉత్పత్తి అయిన విద్యుత్ అక్కడే వినియోగమైనట్లు తెలుస్తోంది. పీపీఏలపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకునే వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. అయితే, అమల్లోలేని పీపీఏలపై కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని ఏపీ ఇంధన శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా